NEGGEDEVARU – ONGOLE : బాలినేని ఆరేస్తారా.. దామచర్ల షాకిస్తారా.. ఒంగోలులో నెగ్గేదెవరు ?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా... అభ్యర్థుల టెన్షన్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగారు.
ఒంగోలులో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోసారి గెలుస్తారా ? లేదంటే దామచర్ల జనార్దన్… రెండోసారి శాసనసభలో అడుగుపెడతారా? మాజీమంత్రి బాలినేనికి కలిసి వచ్చే అంశాలు ఏంటి ? టీడీపీ నేతల ఆశలకు అసలు లెక్కలేంటి ? భారీగా జరిగిన ఓటింగ్ లాభించేదెవరికి ? ఒంగోలు ఓటర్లు ఎటు వైపు మొగ్గారు ? ఒంగోలులో నెగ్గేదెవరు?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా… అభ్యర్థుల టెన్షన్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఏ పార్టీ సక్సెస్ అయింది.. ఒంగోలు ఓటర్లు ఏ పార్టీ వైపు టర్న్ అయ్యారు. ఇవే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారాయ్. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేని.. మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. కొన్ని రోజులు రీజనల్ ఇన్‌చార్జ్‌గానూ పని చేశారు. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికే పరిమతం అయ్యారు. ఆయన ఏం మాట్లాడినా… కాంట్రవర్సీ కావటంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా.. టీడీపీ, జనసేనలు ఎదురు దాడికి దిగాయి. బాలినేని మంచోడే… ఆయన కొడుకు మాత్రం మామూలోడు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. జరుగుతున్న పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకున్న బాలినేని నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు. తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవేనంటూ బరిలోకి దిగారు బాలినేని. ఇక టీడీపీ అభ్యర్థి దామచర్ల కూడా తగ్గేదే లే అంటున్నారు. 2014లో బాలినేనిపై విజయం సాధించిన దామచర్ల.. ఒంగోలును స్మార్ట్ సిటీగా డెవలప్ చేశారు. ఐతే అభివృద్ది మంత్రంతో 2019ఎన్నికలకు వెళ్లినా… ఫ్యాన్ ప్రభంజనం ముందు నిలబడలేక పోయారు. ఐనా ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేగా దామచర్ల సక్సెస్ అయ్యారు. బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా దాన్ని జనాల దగ్గరకు తీసుకు వెళ్లగలిగారు. 2024లోనూ మరోసారి వీరిద్దరే ప్రత్యర్దులు కావటంతో టైట్ ఫైట్ ఉందన్న అంచనాలు ఉన్నాయ్..
బాలినేని తరఫున ఆయన భార్య, కుమారుడు, కోడలు ప్రచారం చేశారు. దామచర్ల తరఫున ఆయన భార్య, కూతుళ్లు నియోజకవర్గంలో తిరిగారు. నగరవాసులు కూడా తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. 2019లో కూడా 84.53 పోలింగ్ శాతం నమోదుకాగా. ఈ ఎన్నికల్లో 86.46 శాతం మంది ఓటేశారు. ఒంగోలులో మొత్తం 2లక్షల 40వేల 242 మంది ఓటర్లు ఉంటే… వారిలో 2లక్షల 3వేల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంగోలు నగరంలో 82.04 శాతం, ఒంగోలు రూరల్‌లో 92.42 శాతం, కొత్తపట్నంలో 91.26 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులతో పోలిస్తే దాదాపు ఏడు వేల మంది మహిళలు అత్యధికంగా ఓటు వేశారు. మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనటంతో… తమకే కలిసి వస్తుందని ఇరుపార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు పోల్ మేనేజ్‌మెంట్ బాగానే చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటంలో.. కొంత వైసీపీనే పైచేయి సాధించిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జనాలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే బాలినేనిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నికల సమయంలో కొందరు వైసీపీ నేతలతో పాటు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాగారు. జనసేన నేతలతో కలసి తమకు కలిసి వచ్చే అన్నీ అంశాలను వదిలిపెట్టకుండా వినియోగించుకున్నారు. మరోవైపు బాలినేని కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏపీలో కాపులు మొత్తం కూటమికి టర్న్ అయినా… ఒంగోలులో మాత్రం వైసీపీకి కొంతవరకు ఓట్లు పడేలా చేసుకోగలిగారు. బీసీలను, మైనారిటీలను తమకు అనుకూలంగా తిప్పుకోవటంలో సఫలమైనట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఒంగోలులో తమదే విజయం అని.. రెండు పార్టీల నేతలు ఆశాభావంలో ఉన్నారు. ఐతే ఓటరు నాడి ఏంటనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఒంగోలులో గెలుపోటములపై భారీగానే బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. టీడీపీ మద్దతుదారులు భారీగా బెట్టింగులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఒకటికి రెండు రెట్లు అధికంగా ఇస్తామంటూ మందుకు వస్తున్నారు. వైసీపీ నేతలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా.. బెట్టింగుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి ఒంగోలు ఓటర్లు ఎటువైపు టర్న్ ఔట్ అయ్యారనేది తెలియాలంటే ఫలితాల వరకూ వేచిచూడాలి.