Top story; చైనా ఫైటర్ జెట్లపై బంగ్లాదేశ్, పాక్ ఫోకస్.. భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్నారా?

ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం.. ప్రజలకు తిండిపెట్టే పరిస్థితి ఆ ఇద్దరికీ లేదు. జనం తిప్పలు పడుతున్నా పట్టింపూ ఉండదు. కానీ, అత్యాధునిక యుద్ధ విమానాలపై ఇద్దరి కన్నూ పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 03:15 PMLast Updated on: Dec 26, 2024 | 3:15 PM

Bangladesh Pakistan Focus On Chinese Fighter Jets Are They Preparing For War With India

ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం.. ప్రజలకు తిండిపెట్టే పరిస్థితి ఆ ఇద్దరికీ లేదు. జనం తిప్పలు పడుతున్నా పట్టింపూ ఉండదు. కానీ, అత్యాధునిక యుద్ధ విమానాలపై ఇద్దరి కన్నూ పడింది. వారిలో ఒకరు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ అయితే, మరొకరు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. ఈ ఇద్దరు కొనుగోలు చేయబోతోంది చైనా మేడ్ ఫైటర్ జెట్స్ జే-10సీ, జే35ఏ. కానీ, ఆ ఇద్దరు ఇప్పుడే వీటిని ఎందుకు కొనాలనుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న. ఇంతకూ, తినడానికి తిండి లేకపోయినా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తమ సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఎందుకనుకుంటున్నాయి? భారత్ లక్ష్యంగా ఆ మూడు దేశాలు ఒక్కటువుతున్నాయనుకోవచ్చా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

ఒకప్పుడు కత్తులు దూసుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. అదికూడా భారత్ లక్ష్యంగా చేతులు కలుపుతున్నాయి. తినడానికి తిండి లేకపోయినా రక్షణ రంగాలను తిరుగులేని విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నాయి. అందుకు డర్టీకంట్రీ డ్రాగన్ సాయం తీసుకుంటున్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్ చైనా మేడ్ చెంగ్డు జే-10సీ అనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎఫ్-16 యుద్ధవిమానాలకు సమానంగా చైనా చెంగ్డు జె-10సీ ఫైటర్లను చెబుతారు. చైనాతో కనుక ఈ డీల్ పూర్తైతే.. పాకిస్తాన్‌ తర్వాత అధు నాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండో దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఢాకా బాటలోనే అడుగులేస్తోంది. బంగ్లాదేశ్ జే10సీపై ఫోకస్ చేస్తే.. పాకిస్తాన్ ఏకంగా జే-35ఏ ఫైటర్ల కోసం బీజింగ్‌తో సంప్రదింపులు షురూ చేసింది.

ఇటీవల జుహయ్‌ వేదికగా జరిగిన ఎయిర్‌షోలో జే-35ఏ యుద్ధ విమానాన్ని చైనా ప్రదర్శనకు ఉంచింది. దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్‌ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది. షెన్యాంగ్ జె-35గా పిలిచే రెండు ఇంజిన్లు కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్‌ సోనిక్ జెట్ మల్టీరోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే జే-20 పేరుతో 5జీ ఫైటర్ జెట్‌ను చైనా అభివృద్ధి చేయగా.. ఇది రెండోది. కానీ, జే-35 డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5జీ ఫైటర్ విమానం ఎఫ్-35ను పోలి ఉంది. అయితే, ఇందులో ఒక ఇంజిన్ ఉంటే.. చైనా జెట్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. ఎదుటివారిని కాపీ కొట్టడంలో చైనాకు మించినవారు లేరు. ఆ దేశం అభివృద్ధి చేసిన 5జీ మొదటి ఫైటర్ జెట్ జే-20 కూడా అచ్చం అమెరికాకు చెందిన ఎఫ్-22 రాప్టర్‌లాగే ఉంటుంది. దీనిలో కానార్డ్‌లు మినహా డిజైన్‌ సేమ్ టూ సేమ్. విగోరస్ డ్రాగన్‌గా పిలుచుకునే చెంగ్డు జే-10 కూడా అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్నే పోలి ఉంటుంది.

ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర పాతతరం అమెరికా తయారీ ఎఫ్-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో.. ప్రస్తుత జే-35 రకం ఫైటర్ జెట్లను వినియోగించాలని ఆలోచిస్తోంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే.. కేవలం రెండేళ్లల్లోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా అందించాల్సి ఉంటుంది. జే-35ఏ ఫైటర్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. ట్విన్-ఇంజిన్, సింగిల్-సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్‌గా చెప్పొచ్చు. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీ-రోల్ ఫీచర్లు కలిగిన స్టెల్త్ ఫైటర్ జెట్‌గా చైనా ప్రకటించింది. అయితే పాకిస్తాన్‌తో ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ.. పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోద ముద్ర వేసిందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయినప్పటికీ చైనా వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించేలా ఈ జెట్లను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను భారత్‌పై ఉసిగొల్పడానికి ఈ డీల్ చైనాకు ముఖ్యం. కానీ, చివరకు ఈ ఒప్పందాలే తమ జాతీయ ఆస్తులను చైనాకు ధారాదత్తం చేస్తాయని ఆ రెండుదేశాలకు తెలియడంలేదు.

యుద్ధ విమానాల కొనుగోలు చర్చలతో శత్రు దేశాలు మూడూ ఒక్కటువుతున్నాయని తేలిపోయిది. మరి ఆ ముగ్గురినీ ఒకేసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే? అందుకు భారత్ ఎప్పుడో రెడీ అయింది. ఇప్పటికే మన దగ్గర రాఫెల్ వంటి పవర్ ఫుల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఫ్రాన్స్‌తో మెరైన్ ఫైటర్ జెట్ల డీల్ తుదిదశకు చేరింది.
50 వేల కోట్లతో 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఆ డీల్ ముగిసి 26 ఫైటర్ జెట్లు అందుబాటులోకి వస్తే మనవైపు చూసే ధైర్యం కూడా శత్రువు చేయలేడు. ఎందుకంటే సముద్ర యుద్ధాల్లో వాటికవే సాటి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను మన గగనతలంలోకి రాకుండానే అవి అడ్డుకుంటాయి. సో.. ఆ మూడు దేశాలు ఎన్ని కుట్రలు చేసిన ఇండియాకు వచ్చే నష్టమేం ఉండదు.