R Krishnaiah: బీసీలకు కాంగ్రెస్ గాలం.. ఆర్ కృష్ణయ్యతో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే భేటీ

ఆర్ కృష‌్ణయ్య ద్వారా బీసీ సంఘాల మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ భేటీ ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. వీరి భేటీలో బీసీ డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కీలకంగా చర్చించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2023 | 04:16 PMLast Updated on: Jul 30, 2023 | 4:17 PM

Bc Leader Krishnaiah Meets Manikrao Thakre

R Krishnaiah: వైసీపీ తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్న బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ పరంగా ఆర్ కృష‌్ణయ్య వైసీపీకి చెందినప్పటికీ, బీసీ ఉద్యమ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయనతో ఠాక్రే భేటీ అయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేస్తోంది. బీసీలకు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

అలాగే బీసీ డిక్లరేషన్ కూడా త్వరలో ప్రకటించబోతుంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దేశంలో బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ కృష‌్ణయ్య, ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్ కృష‌్ణయ్య ద్వారా బీసీ సంఘాల మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ భేటీ ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. వీరి భేటీలో బీసీ డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కీలకంగా చర్చించారు. నిజానికి ఇద్దరిమధ్యా గతంలోనూ పరిచయం ఉంది. తెలంగాణలో బీసీలు 55 శాతం ఉన్నారని, కానీ, చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే విషయాన్ని ఆర్ కృష‌్ణయ్య.. ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాలని కృష‌్ణయ్య సూచించారు. ఠాక్రే మాట్లాడుతూ.. తెలంగణలో ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

ఓబీసీలకు న్యాయం చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఠాక్రే వివరించారు. కృష‌్ణయ్య డిమాండ్లు, కాంగ్రెస్ విధానాలు.. రెండూ ఒక్కటేనని ఠాక్రే చెప్పారు. బీసీల అండతో రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ధీమాను ఠాక్రే వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష‌్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికంగా ఉన్న బీసీలను ఆకట్టుకునే పనిలో ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కూడా పాల్గొన్నారు. అయితే, వైసీపీ ఒక పక్క కేంద్రంలో బీజేపీకి అండగా ఉంటోంది. కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో చర్చించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.