Karnataka Elections: కర్ణాటక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్.. ఎంత డబ్బు చేతులు మారుతుందో తెలుసా..!

ఎక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. అధికారంలోకి వచ్చేపార్టీ ఏంటి.. మెజారిటీ ఎంత.. ఇలా రకరకాల ప్రశ్నలు జనాలను వెంటాతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 11, 2023 | 03:55 PMLast Updated on: May 11, 2023 | 3:55 PM

Betting On Karnataka Elections In Telangana And Andhra Pradesh

Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఎన్నికల ఫలితాలు తేలబోతున్నాయి. హంగ్‌ ఖాయం అంటూ దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేశాయి. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి పెరిగింది. ఎక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. అధికారంలోకి వచ్చేపార్టీ ఏంటి.. మెజారిటీ ఎంత.. ఇలా రకరకాల ప్రశ్నలు జనాలను వెంటాతున్నాయి.

దీంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ పీక్స్‌‌కు చేరాయి ఈ బెట్టింగ్స్‌. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు… పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇంతకు ముందు వేసిన బెట్టింగ్స్‌ను కొంతమంది మార్చుకుంటుంటే.. బెట్టింగ్ మొత్తాలను పెంచేసుకుంటున్నారు ఇంకొందరు. ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా నమ్మడం హైలైట్ ఇక్కడ! బీజేపీనే గెలుస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో.. అంతే మొత్తంలో కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్స్ వేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ పంందెం రాయుళ్ల కోసం ఎదురుచూస్తున్న బెట్టింగ్ బాబులు.. బెట్టింగుల్లో రకరకాల ఆప్షన్లను తెరమీదకు తీసుకువస్తున్నారు.

బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి..? కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది..? జేడీఎస్ పరిస్థితి ఏంటి..? అనే వాటిపై బెట్టింగ్ జరుగుతోంది. వీటితోపాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీద కూడా పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న కొందరు.. అంతకు ముందు తాము కట్టిన పందేలలో నష్టపోకుండా ఉండేందుకు రివర్స్ బెట్టింగ్ వేస్తున్నారు. అంటే.. గతంలో ఒక పార్టీ విజయంపై బెట్టింగ్ వేసిన వాళ్లు.. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి ఇచ్చిన సీట్లు చూశాక.. డామేజ్ కంట్రోల్ కోసం ఇంకో పార్టీ గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను దగ్గర పెట్టుకుని వాటి యావరేజీ ఎంత.. మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చనే దానిపై లెక్కలు కడుతున్నారు. రాజకీయ విశ్లేషకులను మించిన విశ్లేషణలు చేస్తున్నారు పందెం రాయుళ్లు. బెట్టింగ్ వేసిన వాళ్లంతా.. ఫలితాల అంచనాలలో బిజీ అయిపోయారు. దీంతో బెట్టింగ్ లక్షల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌తో పాటు.. ఏపీలోని భీమవరం కేంద్రంగానే గతంలో బెట్టింగ్స్ జరిగేవి. ఇప్పుడు చిన్నా చితకా పట్టణాలకు, గ్రామాలకు కూడా బెట్టింగ్ దందా వ్యాపించింది. కౌంటింగ్ జరిగే సమయంలోనూ బెట్టింగ్స్ వేస్తుంటారు పందెం రాయుళ్లు. ట్రెండ్స్‌ను బట్టి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పందేలను మార్చేస్తుంటారు. ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు రేపుతున్నాయి.