Gandra Venkata Ramana Reddy: ‘సిట్టింగ్’ మే సవాల్.. భూపాలపల్లిలో ‘సన్’ స్ట్రోక్
భూపాలపల్లి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికే టికెట్ ఖాయం చేసినప్పటికీ.. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్ తాను పోటీ చేసి తీరుతానని అంటున్నారు.
Gandra Venkata Ramana Reddy: భూపాలపల్లి అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికే టికెట్ ఖాయం చేసినప్పటికీ.. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్ తాను పోటీ చేసి తీరుతానని అంటున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ అనుచరులను ఎన్నికల కోసం సమాయత్తం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన మధుసూదనాచారి కుమారుడు ఇలా రెబల్‌గా వ్యవహరిస్తుండడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని పార్టీ ధిక్కరణ చర్యగానే పరిగణిస్తున్నారని సమాచారం. ప్రశాంత్ పొలిటికల్ యాక్టివిటీకి కారణమేంటి..? అనే దానిపై కారు పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ప్రశాంత్ నిర్ణయాన్ని సిరికొండ మధుసూదనాచారి అనుచరులు కూడా తప్పుపడుతున్నారు.
2018 అసెంబ్లీ పోల్స్‌లో భూపాలపల్లిలో మధుసూదనాచారి ఓటమికి ఆయన కుమారుడు ప్రశాంత్ వ్యవహారశైలే కారణమని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గండ్ర దంపతులు సిరికొండ మధుసూదనాచారిని కలిశారు. వారికి సహకరిస్తానని మధుసూదనచారి మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ల జాబితాను ప్రకటించడానికి కొన్ని నెలల ముందే.. భూపాలపల్లి నుంచి గండ్రను అభ్యర్థిగా నిలబెడతామని కేటీఆర్ అనౌన్స్ చేశారు. నాటి నుంచే గండ్ర తన వర్కవుట్‌ను ప్రారంభించారు. మండలాలు, గ్రామాల వారీగా రాజకీయ సమీకరణాలను చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు మధుసూదనాచారి అభిమానులు వెనక్కి తగ్గి గండ్రకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి గండ్ర, సిరికొండ వర్గీయుల మధ్య గత మూడేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది.
కొన్ని నెలల క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్.. భూపాలపల్లి జిల్లాకు వెళ్లారు. ఆ సందర్భంగా కేటీఆర్‌కు హెలీప్యాడ్‌లో స్వాగతం పలికేందుకు మధుసూధనాచారి వర్గీయులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో మధుసూధనాచారి వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గండ్ర వర్గీయులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ సభలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతుండగా.. మధుసూధనాచారి వర్గీయులు జై సిరికొండ అంటూ నినాదాలు చేశారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో.. లేచి నిలబడి మరీ.. కేటీఆర్‌కు కనిపించేలా, వినిపించేలా నినాదాలు చేశారు. మధుసూధనాచారికి పార్టీలో అన్యాయం జరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఆయనకే ఇవ్వాలని స్లోగన్స్ ఇచ్చారు. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా మధుసూధనాచారి పనిచేశారు.
అయితే 2018 అసెంబ్లీ పోల్స్‌లో మాత్రం.. నాటి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో గండ్ర బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరినప్పటినుంచి చారి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్.. ఆయన్ను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ మళ్లీ బలోపేతం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరు, ఏ క్షణంలో, ఏ కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.