రగులుతున్న బెంగాల్ లేడీడాక్టర్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఆ దారుణమారణకాండ జరిగి దాదాపు 40 రోజులు. ముందు పోలీసులు రంగంలోకి దిగారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేసారు. ఇంకేముంది కేసు డొంక కదులుతుంది అనుకున్నారు. ఏదీ జరగలేదు. ఆ తర్వాత హైకోర్ట్ ఆదేశాలతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది.
ఆ దారుణమారణకాండ జరిగి దాదాపు 40 రోజులు. ముందు పోలీసులు రంగంలోకి దిగారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేసారు. ఇంకేముంది కేసు డొంక కదులుతుంది అనుకున్నారు. ఏదీ జరగలేదు. ఆ తర్వాత హైకోర్ట్ ఆదేశాలతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. నేరస్తులు ఎక్కడ దాక్కున్నా సరే కోర్టు బోనులో నిలబడక తప్పదు అనుకున్నారు. నో ప్రోగ్రెస్ ఎట్ ఆల్.. అసలు కోల్ కతా ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో రేప్ అండ్ మర్డర్ కు గురైన అభాగ్యురాలి కుటుంబానికి న్యాయం దక్కుతుందా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పటి కైనా మనిషిగా కాకున్నా కనీసం మహిళలా అయినా మానవత్వంతో ప్రవర్తిస్తుందా?
ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన లేడీ డాక్టర్ హత్య కేసును చేధించండి. దోషులు ఎవరైనా సరే న్యాయస్ధానం ముందు నిల్చోబెట్టి, కఠినంగా శిక్షలు వేయండి అంటూ జూనియర్ డాక్టర్లు 35రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్ట్ చెప్పినా సరే విధుల్లోకి చేరకుండా వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తూనే ఉన్నారు డాక్టర్లు. డిసిప్లినరీ యాక్షన్ పేరుతో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ 51మందికి నోటీసులు ఇచ్చినా సరే ససేమిరా అంటున్నారు. మమత సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న జూనియర్ డాక్టర్లు ఎక్కడా తగ్గటం లేదు. సీఎం మమతా బెనర్జీ చర్చలకు ఆహ్వానించినా… కండీషన్లు పెట్టారు. 30మంది టీమ్ వస్తుందని, తమతో సీఎం మమతా బెనర్జీ మీటింగ్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టు పట్టారు జూనియర్ వైద్యులు. అటు మమతా బెనర్జీ కూడా పట్టు వీడటం లేదు. ఇప్పటికే 27మంది రోగులు చనిపోయారు కనుక బెట్టువీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ కష్టం కానీ చర్చల ప్రకియను వీడియో రికార్డ్ చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పింది. ఇలా ఎవరికి వారు పట్టువీడకపోవడంతో… చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.
అసలే హైపర్ యాక్టివిటీకి మారు పేరుగా నిలిచే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిబిఐను టార్గెట్ చేసింది. ఏదో చేసేస్తారు అనుకుంటే ఏమీ చేయలేకపోతున్నారంటూ, దీనివల్ల సర్కార్‌కు చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. అంతేకాదు బెంగాల్ ప్రజలు దుర్గామాతా ఉత్సవాలకు రెడీ అవ్వాలంటూ ఆమె ఇచ్చిన పిలుపు అటు జూనియర్ డాక్టర్లలోనూ ఇటు మృతురాలి కుటుంబీకుల్లోనూ కాక రేపింది. కోల్ కతా పోలీసులు మాత్రమే కాకుండా సీఎం మమతా బెనర్జీ కూడా తమకు లంచం ఇచ్చేందుకు ట్రై చేసారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఫైర్ అయిన సీఎం మమతా అవసరమైతే రాజీనామాకు నేను రెడీ అని సంచలనానికి తెరతీసారు. ఇది చాలదన్నట్లు బెంగాల్ గవర్నర్ సీవి బోస్ కూడా… సీఎం మమతా టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేసారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీదీతో వేదిక పంచుకోనని నేను ముమ్మాటికి ప్రజలపక్షమేనంటూ తేల్చి చెప్పారాయన.
నిజానికి ఈ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చినా ఈ కేసులో పురోగతి లేదు. సిబిఐ ఇప్పటికే దాదాపు 100మంది వాంగ్మూలలను నమోదు చేసింది. కొందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించింది. పాలిగ్రాఫ్ టెస్టులు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు నిర్వహించినా సరే కేసు ముందుకు కదలటం లేదు. ఇదిలా ఉంటే… పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఒక కీలక పత్రం మిస్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు… బెంగాల్ సర్కార్ తరపు అడ్వోకేట్ కు తలంటింది. ఈ నెల 17లోగా కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ను అప్పగించాలని ఆర్డర్ వేసింది సుప్రీం ధర్మాసనం. ఇదిలా ఉంటే మొదట గ్యాంగ్ రేప్ అనుకున్నా సిబిఐ కాదు ఒక్కరే చేసిన ఘాతుకం అంటూ తేల్చేసిన నేపధ్యంలో… అందరూ అనుమానిస్తున్నట్లు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ … లేడీ డాక్టర్ ను రేప్ చేసి చంపేసాడా లేక ఎన్నో అనుమానాలు ఉన్నట్లు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇదంతా చేయించాడా అనేది తేలాల్సి ఉంది. ఏది నిజం మరేది అబద్దం అని తేలాలంటే కొన్ని నెలలు ఆగక తప్పేలా లేదు.