Pawan Kalyan – BJP : పవన్ కళ్యాణ్‌కి బీజేపీ చెప్పిన ప్లాన్ ఇదే..! వర్కవుట్ అవుతుందా..!?
ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పుడు కళ్ల ముందున్న అవకాశాన్ని వదులుకోవాలా.. అని పవన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించకపోతే తాము మరింత ఇబ్బందుల్లో పడతామనేది పవన్ ఆలోచన. అందుకే బీజేపీ మాటలు వినాలా.. లేకుంటే టీడీపీతో వెళ్లాలా.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పవన్ ఇంకా నోరు మెదపలేదు. తన సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. పాలిటిక్స్ చేసేంత టైమ్ ఆయనకు ఇప్పుడు లేదు. కాబట్టి అసలు పవన్ కల్యాణ్ బీజేపీతో ఉంటారా.. లేకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా.. అనే ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పవన్ కల్యాణ్ కచ్చితంగా నోరు విప్పాల్సిందే.!
అయితే బీజేపీ పెద్దలు మాత్రం పవన్ కల్యాణ్ కు కాస్త హితబోధ చేశారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పవన్ కు … తమదైన స్టైల్లో రాజకీయం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు కచ్చితంగా బీజేపీ- జనసేన కూటమిదేనని క్లారిటీ ఇచ్చారు. దీనికి బీజేపీ హైకమాండ్ సరికొత్త ఫార్ములా తెరపైకి తెచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీదే అధికారం. కానీ సీట్లు భారీగా తగ్గుతాయి. టీడీపీ ఇంకా అధికారానికి చేరువ కాలేదు. అయితే సీట్లు పెరుగుతాయి. అయినా ఈసారి జగన్ అధికారంలోకి వస్తే టీడీపీని బతకనివ్వరు. పూర్తిగా అంతర్ధానం చేస్తారు. టీడీపీ అంతు చూసే వరకూ నిద్రపోరు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోతుంది. అలాంటి టీడీపీతో వెళ్తే పెద్దగా ఉపయోగం లేదు. అదే సమయంలో 2029నాటికి వైసీపీపైన కూడా వ్యతిరేకత మొదలవుతుంది. అప్పుడు ప్రత్యామ్నాయం జనసేన- బీజేపీ మాత్రమే. అప్పుడు మనదే అధికారం. పవన్ కల్యాణ్ సీఎం అవ్వచ్చు.
…. ఇదే పవన్ కల్యాణ్ కు బీజేపీ పెద్దలు చెప్పిన మాట. అయితే ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పుడు కళ్ల ముందున్న అవకాశాన్ని వదులుకోవాలా.. అని పవన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించకపోతే తాము మరింత ఇబ్బందుల్లో పడతామనేది పవన్ ఆలోచన. అందుకే బీజేపీ మాటలు వినాలా.. లేకుంటే టీడీపీతో వెళ్లాలా.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.