BJP Vs BRS: బీజేపీ, బీఆర్ఎస్ పోస్టర్ వార్.. మోదీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు..

మోదీ పర్యటనను నిరసిస్తూ.. తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వినూత్న రీతిలో స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేసింది. వాట్ హ్యాపెన్‌డ్ మోదీ అంటూ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ సమస్యల్ని, మోదీ నిర్లక్ష్యాన్ని చూపించేలా ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2023 | 01:39 PMLast Updated on: Oct 01, 2023 | 1:39 PM

Bjp And Brs War Through Posters Against Pm Modi And Kcr

BJP Vs BRS: తెలంగాణలో మరోసారి పోస్టర్, ఫ్లెక్సీ వార్‌కు తెరలేపింది బీఆర్ఎస్. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఈ పో్స్టర్లకు వ్యతిరేకంగా బీజేపీ కూడా ప్రత్యేక పోస్టర్లు ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, మోదీ పర్యటనను నిరసిస్తూ.. తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వినూత్న రీతిలో స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేసింది. వాట్ హ్యాపెన్‌డ్ మోదీ అంటూ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు కనిపిస్తున్నాయి.

తెలంగాణ సమస్యల్ని, మోదీ నిర్లక్ష్యాన్ని చూపించేలా ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది..? పసుపు బోర్డు ఎక్కడ..? అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి ఐటీఐఆర్, టెక్స్‌టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, కాజిపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మిషన్ భగీరథ నిధులు, బయ్యారం స్టీల్ ప్లాంట్, పసుపు బోర్డు, మెడికల్ కాలేజీలు, ఐఐఎం ఎక్కడా అంటూ మోదీని ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లున్నాయి. రావణాసురిడిలా మోదీని పది తలలతో చూపిస్తూ.. ప్రతి ముఖానికి ఒక ప్రశ్నతో వెలసిన పోస్టర్ సంచలనంగా మారింది. మీ హామీలు అన్ని నీటి మూటలేనా అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. మోదీ ఎయిర్‌పోర్టుకు రానుండటంతో వీటిని ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అయితే, మోదీపై పోస్టర్లకు పోటీగా బీజేపీ కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు రూపొందించింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం స్నాప్ డీల్‌ను పోలినట్లుగా.. బీఆర్ఎస్ డీల్ అంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది. తెలంగాణలోని అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలోదారుడు అంటూ కేసీఆర్ ఫొటోతో బీజేపీ పోస్టర్లు రూపొందించింది.

ప్రతి ఐదేళ్లకోసారి ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటారు అనేలా వాల్ పోస్టర్ రూపొందించింది. మరో వాల్ పోస్టర్‌లో బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు అంటూ ఆరుగురి ఫొటోలతో ఇంకో పోస్టర్ వెలిసింది. అటు మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్.. ఇటు కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మరోసారి పోస్టర్ వార్‌కు తెరలేపాయి. గతంలో కూడా మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా, మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేసింది. మోదీ, ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడినుంచే సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది బీజేపీ. దీంతో అక్కడ మోదీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.