BJP: దేశంలో ఎన్నికల హీట్ పెంచిన బీజేపీ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మొదటి జాబితా రిలీజ్..!
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని పలు స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. తద్వారా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు తాము రెడీ అయ్యామనే సిగ్నల్స్ ను ప్రత్యర్థి పార్టీలకు పంపింది.
BJP: ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ సందడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని పలు స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. తద్వారా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు తాము రెడీ అయ్యామనే సిగ్నల్స్ ను ప్రత్యర్థి పార్టీలకు పంపింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌కు 21 మంది అభ్యర్థులను, 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌కు 39 మంది అభ్యర్థుల పేర్లను కమల దళం వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే ఈ లిస్ట్‌ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. పీఎం మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఈ లిస్టులోని అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారని సమాచారం. ఛత్తీస్‌గఢ్ కు అనౌన్స్ చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘేల్ సిట్టింగ్ అసెంబ్లీ స్థానం పటాన్ నుంచి బీజేపీ ఎంపీ విజయ్ బఘేల్ కు టికెట్ ఇచ్చారు. విజయ్ బఘేల్ కు భూపేష్ బాఘేల్ మేనమామ అవుతారు. ఇక మధ్యప్రదేశ్ కు ప్రకటించిన 39 మంది అభ్యర్థులలో ఐదుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు లేదు. మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కనపడలేదు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఈ లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేయడం గమనార్హం. తొలి లిస్టులో ప్రకటించిన స్థానాలన్నీ బీజేపీ బలహీనంగా ఉన్నవేనని, అక్కడ గ్రౌండ్ వర్క్ చేసేందుకు ఎక్కువ టైం లభిస్తుందనే ఉద్దేశంతోనే అభ్యర్థుల పేర్లను త్వరగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్.. A,B,C,D
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లను బీజేపీ A, B,C, D అనే నాలుగు కేటగిరీలుగా విభజించింది. గెలుపు అవకాశాలు, పోటీ తీవ్రత ఆధారంగా ఈ విభజన జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని A కేటగిరీ సీట్లలో.. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచినవి ఉన్నాయి. B కేటగిరీ సీట్లలో.. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన, గెలిచిన స్థానాలు మిక్స్ డ్ గా ఉంటాయి. C, D కేటగిరీ సీట్లలో.. బీజేపీకి ఛాలెంజింగ్ గా మారిన 22 స్థానాలు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ అభ్యర్థుల లిస్టులో 21 సీట్లు C, D కేటగిరీకి చెందినవేనని అంటున్నారు. ఈ రాష్ట్రంలోని సగం సీట్లలో కొత్త క్యాండిడేట్స్ ను బరిలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందట.
తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థులు..?
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. సెప్టెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనుంది. పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
వసుంధరా రాజేకు షాక్..
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ పోల్స్ జరగనున్న మరో రాష్ట్రం రాజస్థాన్‌కు రెండు కీలక ఎన్నికల కమిటీలను బీజేపీ గురువారం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఆశ్చర్యకరంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజేకు ఈ ప్యానెల్‌లలో దేనిలోనూ చోటు దక్కలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియాలకు కూడా ఈ కమిటీల్లో ఛాన్స్ ఇవ్వలేదు. 21 మంది సభ్యులతో కూడిన ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్‌లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా, 25 మంది సభ్యులతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వం వహిస్తారని జేపీ నడ్డా వెల్లడించారు. ఎంపీ కిరోడి లాల్ మీనా, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పేర్లు ఈ కమిటీల్లో ఉన్నాయి.