Daggubati Purandeswari: అసెంబ్లీపై చిన్నమ్మ ఫోకస్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పురందేశ్వరి
రాబోయే ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు పురందేశ్వరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఎంపీగా గెలిచిన పురందేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు.

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి ఒక వైపు పార్టీ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే పనిలో ఉన్నారు. పురందేశ్వరికి రాజకీయంగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధిగా మాత్రం ఏ సభలోనూ కొనసాగడం లేదు. అందుకే ఈసారి ప్రజాప్రతినిధిగా గెలిచి, తిరిగి తన సత్తా చాటాలనుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు పురందేశ్వరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఎంపీగా గెలిచిన పురందేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి, 2019లో విశాఖపట్నం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చివరగా పోటీ చేసిన రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవడం పురందేశ్వరికి ఇబ్బందిగా మారింది. అందుకే ఈసారి వ్యూహం మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈసారి పార్లమెంటుకు కాకుండా.. ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకు అనువైన నియోజకవర్గాలపై పురందేశ్వరి ఫోకస్ చేస్తున్నారు. తాను గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు.
తన సామాజికవర్గం ఎక్కువగా నియోజకవర్గాల్లో ఒకదాన్ని పురందేశ్వరి ఎంచుకుని, పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు తనే కాబట్టి.. పార్టీ తరఫున ఎక్కడి నుంచైనా పోటీ చేసే వీలుంది. అలాగే జనసేన మద్దతు ఎలాగూ ఉంటుంది. టీడీపీతో కూడా జతకలిస్తే గెలవడం గ్యారెంటీ అని పురందేశ్వరి లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతానికి రాజంపేట లేదా పరుచూరు నియోజకవర్గాలపై ఆమె దృష్టిసారించారు. ఈ రెండింట్లో ఒక నియోజకవర్గం లేదా రెండింటి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకున్న ఇమేజ్ ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగపడుతుంది. బలమైన కమ్మ సామాజికవర్గం కూడా మద్దతు ఇస్తుంది.
అందుకే ఎంపీగా పోటీ చేయడంకంటే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడమే తన రాజకీయ భవిష్యత్తుకు మంచిది అని పురందేశ్వరి అభిప్రాయం. ఈ ఎన్నికలు కచ్చితంగా పురందేశ్వరికి కీలకమే. వరుసగా రెండుసార్లు ఓడిపోయినప్పటికీ బీజేపీ.. ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో తాను గెలవడంతోపాటు, పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. అదే జరిగితే.. మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ కూడా ఉంది.