JP Nadda: బీజేపీ ఎలక్షన్ టీం రెడీ.. కార్యవర్గంలో కీలక మార్పులు.. పాస్మాండ ముస్లింకు కీలక పదవి

2024లో కేంద్రంలో తిరిగి అధికారమే లక్ష్యంగా సమూల మార్పులకు దిగారు జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా. వెనకబడిన తరగతిగా చెప్పుకొనే పాస్మాండ ముస్లిం వర్గానికి చెందిన తారిఖ్ మన్సూర్‌కు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళా నేత లతా ఉసేండికి, బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2023 | 01:37 PMLast Updated on: Jul 30, 2023 | 1:37 PM

Bjp Chief Jp Nadda Rejigs Party Central Leadership

JP Nadda: మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో భారీ మార్పులు చేసింది అధిష్టానం. 2024లో కేంద్రంలో తిరిగి అధికారమే లక్ష్యంగా సమూల మార్పులకు దిగారు జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా. వెనకబడిన తరగతిగా చెప్పుకొనే పాస్మాండ ముస్లిం వర్గానికి చెందిన తారిఖ్ మన్సూర్‌కు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. ముస్లింకు కీలక పదవి ఇవ్వడం వల్ల ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాధా మోహన్‌సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. తారిఖ్‌ మన్సూర్‌ గతంలో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వీసీగా పని చేశారు. తారిఖ్ మన్సూర్‌తోపాటు యూపీకి చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ను కూడా ఉపాధ్యక్షుడిగా నియమించారు. కేరళకు చెందిన అబ్దుల్లా కుట్టి కూడా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శుల్ని పదవి నుంచి తొలగించింది. కర్ణాటకకు చెందిన సీటీ రవి, అసోంకు చెందిన పార్లమెంటు సభ్యుడు దిలీప్‌ సైకియాలను ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. వీరి స్థానంలో ఈ రెండు పదవుల్ని ఒక ఎస్టీ, ఒక బీసీకి కట్టబెట్టింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళా నేత లతా ఉసేండికి, బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చింది. వీరితోపాటు యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాధా మోహన్‌ అగర్వాల్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

చత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లతా ఉసేండికి ఈ పదవి దక్కింది. పార్టీలో మొత్తం తొమ్మిది మందే జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉంటారు. అలాగే ప్రస్తుతం కార్యదర్శులుగా కొనసాగుతున్న ఎంపీలు వినోద్‌ సొంకర్‌, హరీశ్‌ ద్వివేదీతోపాటు ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్‌ దియోధర్‌ను పదవుల నుంచి తొలగించారు. సునీల్ దియోధర్ స్థానంలో బండి సంజయ్‌ను ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. బీజేపీకి అక్కడ ఊపు తేవాలంటే ఈ ప్రాంతం గురించి తెలిసిన బండి అయితేనే బాగుంటుందని హైకమాండ్ నిర్ణయం. తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చిన నేతగా బండికి గుర్తింపు ఉంది. అందుకే బండి అయితేనే.. ఏపీలో పార్టీని ముందుకు తీసుకెళ్లగలడని బీజేపీ అంచనా.

జాతీయ కార్యదర్శులుగా యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సురేంద్రసింగ్‌ నాగర్‌, కేరళకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ, అసోంకు చెందిన రాజ్యసభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్‌ టాసా కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో అధ్యక్షుడు, 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులను బీజేపీ నియమించింది. ఈ జట్టులో ఐదుగురు మహిళా ఉపాధ్యక్షులు, నలుగురు మహిళా కార్యదర్శులున్నారు. కార్యవర్గంలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది అధిష్టానం. ఈ జట్టుతోనే 2024లో ఎన్నికలకు వెళ్లబోతుంది.