Bandi Sanjay: బండి సంజయ్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు.. అధ్యక్షుడి మార్పు నిర్ణయం వాయిదా..? తేలని పంచాయితీ..?
బండి సంజయ్‌ని మారుస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. పార్టీ పెద్దలు బండితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను అధ్యక్షుడిగా తొలగించి, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అంశాన్ని వివరిస్తారని, అనంతరం దీనిపై ప్రకటన వస్తుందని అంతా భావించారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో సంక్షోభం ఇంకా అలాగే కొనసాగుతోంది. అధ్యక్ష మార్పు జరగబోతోందంటూ జరిగిన ప్రచారం విషయం నిజమే అయినప్పటికీ.. ఈ విషయంలో అధిష్టానం ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతోంది. బండిని మార్చాలని అనుకున్నా.. ఆయనకు ఆర్ఎస్ఎస్ మద్దతుతో ప్రస్తుతానికి ఈ నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో బండిని మార్చాలా.. వద్దా అనే విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.
బండిని మారుస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. పార్టీ పెద్దలు బండితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను అధ్యక్షుడిగా తొలగించి, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అంశాన్ని వివరిస్తారని, అనంతరం దీనిపై ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఢిల్లీలో బండి హైకమాండ్‌తో సమావేశమైనప్పటికీ ఇంకా ఏం తేల్చలేదు. బీజేపీకి ప్రధాన బలంగా ఉన్న ఆర్ఎస్ఎస్.. బండి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. బండి ఆర్ఎస్ఎస్ మూలాలతోనే బీజేపీలో ఎదిగాడు. ఆయనలో ఆర్ఎస్ఎస్ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీజేపీ సిద్ధాంతాలు కూడా ఆర్ఎస్ఎస్‌తోనే ముడిపడి ఉన్నాయి. బీజేపీపై ఆర్ఎస్ఎస్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో బండికి ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో బండిని ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంచిన అధిష్టానం తాజా పరిణామాల్ని గమనిస్తోంది.
బండి రాకతోనే మైలేజ్
తెలంగాణలో బీజేపీకి ఇప్పటిదాకా ఇంత ఊపొచ్చిందంటే దానికి కారణం కచ్చితంగా బండి సంజయే. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించిన నేతగా బండికి ఆదరణ దక్కింది. నిన్నామొన్నటి వరకు బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఢీకొట్టగలిగేది బీజేపీనే అనే స్థాయికి తీసుకెళ్లింది బండి సంజయే. ఆయన చేపట్టిన కార్యక్రమాలు బీజేపీకి ఆదరణ పెరిగేలా చేశాయి. ఒక దశలో బీఆర్ఎస్‌లో భయం కూడా పట్టుకుంది. దీనికి కారణమైన బండి సంజయ్‌ను తప్పిస్తే, అది పార్టీని దెబ్బతీస్తుందని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది. దీనివల్ల పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతాయని చెబుతోంది. అందుకే బండినే కొనసాగించాలని సూచించింది. అయితే, అందరినీ కలుపుకొని వెళ్లడంలో బండి విఫలమయ్యారు. అందుకే అందరినీ కలుపుకొని, పార్టీకి ఊపు తెచ్చే నేత కోసం బీజేపీ వెతుకుతోంది.
సోషల్ మీడియాలో మద్దతు
బండిని తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఎక్కువగా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నాయి. సోషల్ మీడియాలో బండికి అనుకూలంగా బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. వీటితోపాటు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇంకా కొంత సమయం వేచి చూసి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ బీజేపీలో నెలకొన్న సంక్షోభంపై ఆరా తీసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్ మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ పలువురు నేతలతో భేటీ అవుతారు. వారి అభిప్రాయాలు, అసంతృప్తికి గల కారణాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి వంటి వాటిపై చర్చిస్తారు. ఈ అంశాల్ని పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు. దీని ఆధారంగా కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దిద్దుబాటు చర్యల్లో రఘునందన్ రావు
పార్టీ అధినాయకత్వంపై, బండి సంజయ్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. బండి వందల కోట్లు కూడబెట్టాడని ఆరోపించడమే కాకుండా.. తనకు పదవి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించడంతో రఘునందన్ రావు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, బీజేపీ, తాను వేరు కాదని, ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని వెల్లడించారు. తాను పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పని చేస్తున్నట్లు, బీజేపీలో ఎలాంటి పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు. తాను తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. మరోవైపు కొందరు తెలంగాణ నేతలు రఘునందన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ రావు వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు.