BJP: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అగ్ని పరీక్ష..!

ఈ ఏడాది మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీ‌స్‌గఢ్‌‌తోపాటు, వచ్చే జనవరిలో మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ భావిస్తోంది. అందుకే వీటిలో అత్యధిక రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 08:34 PMLast Updated on: Aug 16, 2023 | 8:34 PM

Bjp Faces Upcoming State Assembly Polls As Semi Finals For Loksabha Elections

BJP: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న మోదీకి అసలైన సవాల్ అసెంబ్లీ ఎన్నికల రూపంలో రాబోతుంది. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, వచ్చే ఏడాది మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ కూటమి గెలిస్తే ఆదే కూటమికి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు సెమీ ఫైనల్స్ వంటివి. ఇక్కడ గెలిస్తేనే ఫైనల్‌గా సార్వత్రిక ఎన్నికల్లో గెలవొచ్చు.
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో, అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమి తప్పలేదు. మోదీసహా బీజేపీ పెద్దలు ఎంతగా ప్రచారం చేసినా.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయి, అధికారం పోగొట్టుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ బలపడింది. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌కు ఊపొచ్చింది. మరోపక్క ప్రతిపక్షాల్ని ఏకం చేసి, మరింత బలోపేతం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు బీజేపీకి కఠిన పరీక్షగా మారనున్నాయి.
ఈ ఏడాది మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీ‌స్‌గఢ్‌‌తోపాటు, వచ్చే జనవరిలో మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ భావిస్తోంది. అందుకే వీటిలో అత్యధిక రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడమో లేక వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవడమో చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిద్వారా కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీ బలపడిందనే వాదనను తిప్పికొట్టాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా, లోక్‌సభ ఎన్నికలకు తగిన వ్యూహాల్ని పన్నే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ కీలకంగా భావిస్తున్న ఎన్నికల కమిషన్‌, న్యాయ సంహితలకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించిన తర్వాత పార్లమెంటుకు సంబంధించి అంత ప్రాధాన్యమైన అంశాలేమీ బీజేపీ దగ్గర లేవు. అందువల్ల ఈ బిల్లులు ఆమోదించుకున్న తర్వాత పూర్తిగా ఎన్నికలు, పొత్తులపైనే బీజేపీ దృష్టిపెట్టబోతుంది. దీనికి అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే సెప్టెంబర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన జీ20 సమావేశాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 11న జరిగే ఈ సమావేశాలు అయిన వెంటనే బీజేపీ పూర్తిగా రాజకీయాలు, ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించబోతుంది. ఇప్పటికే ఎన్నికల దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బూత్‌ స్థాయి ఓటర్ల జాబితాను సమీక్షించడం, పార్టీ కార్యకర్తలను కలుసుకోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ల నియామకం, కార్యకర్తలకు ప్రతి వారానికీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, పార్టీలో నేతల మధ్య విబేధాలను నివారించడం వంటి పలు చర్యలను చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఆయా రాష్ట్రాల్లో ప్రధానిమోదీ, అమిత్‌ షా, అధ్యక్షుడు నడ్డాతోపాటు అగ్రనేతలు బహిరం సభలు నిర్వహిస్తారు. ఎన్నికల వ్యూహ రచనలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌, రాజస్థాన్‌లో వసుంధర, ఛత్తీ‌స్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌కు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణకు సబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ని కూడా ప్రచార రంగంలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. బండిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినా.. ఆయన ప్రతిష్ఠ తగ్గకుండా ఉండేందుకే జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి అప్పజెప్పింది. ఇటీవల పార్లమెంట్‌లో కూడా అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే బండి సంజయ్‌ను మాట్లాడే అవకాశం కల్పించింది. త్వరలో తెలంగాణకు చెందిన కీలక నేతల్ని ఢిల్లీకి పిలిపించి తెలంగాణపై అధిష్టానం సమీక్ష జరపనుంది.