AP Politics: జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీ.. పురందేశ్వరికి బాధ్యతలతో జగన్‌కే లబ్ధి.. జనసేన కూటమికి నో ఛాన్స్..?
ఎన్టీఆర్ కుమార్తెకు పార్టీ పగ్గాలివ్వడం అంటే అదే కుటుంబపు పార్టీగా చెప్పుకొనే టీడీపీకి చెక్ పెట్టడమే అనే వాదన వినిపిస్తోంది. పురందేశ్వరి నియామకం ద్వారా టీడీపీతో పొత్తు సంగతేమో కానీ.. ఆ పార్టీని దెబ్బతీసేందుకే బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
AP Politics: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని అధిష్టానం నియమించడం వెనుక అనేక ప్రణాళికలు ఉన్నట్లు అర్థమవుతోంది. నందమూరి కుటుంబానికి, బలమైన కమ్మ సామాజికవర్గానికి పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆ సామాజికవర్గపు ఓట్లను రాబట్టుకోవచ్చన్నది బీజేపీ ఆలోచన. అయితే, ఈ ఓట్లతో బీజేపీ పెద్దగా గెలిచేదేమీ ఉండదు. ఒకట్రెండు సీట్లు వస్తేనే గొప్ప. కానీ, టీడీపీ ఓట్లు మాత్రం చీలిపోతాయి. ఇది అంతిమంగా జగన్‌కు మేలు చేస్తుంది. ఇలా జగన్‌కు మేలు చేయడం.. టీడీపీని దెబ్బకొట్టడం కోసమే పురందేశ్వరిని నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కుమార్తెకు పార్టీ పగ్గాలివ్వడం అంటే అదే కుటుంబపు పార్టీగా చెప్పుకొనే టీడీపీకి చెక్ పెట్టడమే అనే వాదన వినిపిస్తోంది. పురందేశ్వరి నియామకం ద్వారా టీడీపీతో పొత్తు సంగతేమో కానీ.. ఆ పార్టీని దెబ్బతీసేందుకే బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ పరిస్థితి ఏంటి..?
ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే, దీనికి బీజేపీ అంత సుముఖంగా లేదు. జనసేనతో ఉండాలనుకుంటోంది కానీ.. టీడీపీతో కలవాలనుకోవట్లేదు. బీజేపీ కలిసొచ్చినా.. రాకున్నా.. జనసేన తమతోనే ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి నియామకం ద్వారా టీడీపీతో కలిసేందుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పినట్లైందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి మొదట సత్యకుమార్‌ను బీజేపీ అధ్యక్షుడిని చేయాలనుకుంది అధిష్టానం. ఆయనకు టీడీపీతో సత్సంబంధాలున్నాయి. సత్య కుమార్ అధ్యక్షుడైతే టీడీపీకి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేయకుండా, పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టమైంది. టీడీపీ ఓట్లు చీల్చేందుకే బీజేపీ సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. అయినప్పటికీ పవన్.. మరోసారి బీజేపీ నేతలతో ఒకసారి చర్చలు జరుపుతారు. ఆ తర్వాతే పొత్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పరిణామాలతో పవన్ డైలమాలో ఉన్నారు. పవన్ కోరుకుంటున్నట్లు మూడు పార్టీలు పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవని స్పష్టమవుతోంది. ఇప్పుడు బీజేపీతో వెళ్లాలా.. టీడీపీతో వెళ్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు.
అందరూ జగన్ కోసమేనా..?
కేంద్రంలో బీజేపీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీకి కేంద్రం అనేక విషయాల్లో మొండి చేయి చూపినా.. జగన్ మాత్రం మోదీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఏపీకి పెద్దగా ప్రాజెక్టులు మాత్రం ఇవ్వడం లేదు. అయినా జగన్ నోరు మెదపరు. అటు బీజేపీ కూడా జగన్ విషయంలో పూర్తి సహకారం అందిస్తోంది. అడిగినన్ని అప్పులు తీసుకునేందుకు అనుమతిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉందన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో జగన్ రాజకీయంగా ఎదిగేందుకు కూడా బీజేపీ సహకరిస్తున్నట్లుంది. అందుకే టీడీపీ ఓట్లు చీలి, జగన్‌కు లబ్ధి కలిగేలా పురందేశ్వరిని నియమించింది. కేంద్రంలో జగన్‌కు ఈ రకమైన మద్దతు ఉంటే.. తెలంగాణ నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
సీఎం కేసీఆర్ కూడా జగన్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందని నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటోంది. అలాగే అక్కడి నేతలతో సమావేశాలు జరుపుతూ.. పరోక్షంగా జగన్‌కు మద్దతు ఇవ్వాలి అని కేసీఆర్ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఉన్న సామాజికవర్గం ఓట్లు చీలి, జగన్ గెలుస్తాడని కేసీఆర్ నమ్మకం. ఏపీలో రెండు బలమైన సామాజికవర్గాల ఓట్ల చీలిక కోసం బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. పురందేశ్వరి నియామకం ద్వారా టీడీపీకి చెందిన కమ్మ సామాజికవర్గం ఓట్లు చీల్చేందుకు మోదీ ప్రయత్నిస్తుంటే.. కాపుల ఓట్లు చీల్చి పవన్‌ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో జగన్‌ను ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ మరింతగా కష‌్టపడాలి. తమ వ్యూహాలకు పదునుపెట్టాలి.