Daggubati Purandeswari: పొత్తు కుదిరినట్టేనా..! పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు..
మొన్నటి వరకూ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్న జనసేన పార్టీ.. బాబు అరెస్ట్ తరువాత మాట మార్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. తమతో బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.

Daggubati Purandeswari: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్న జనసేన పార్టీ.. బాబు అరెస్ట్ తరువాత మాట మార్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. తమతో బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. మూడు పార్టీలను ఒక్కటి చేసేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతాను అని కూడా చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్నికలను ఎదుర్కొంటామని.. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కోసం తప్పడంలేదని క్లియర్‌గా చెప్పారు. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో నిజంగానే మాట్లాడారా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఆదివారం ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి పిలుపు వచ్చింది. వెంటనే ఆమె ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, పొత్తుల విషయం గురించి మాట్లాడేందుకే ఆమెను ఢిల్లీ రమ్మన్నారట. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లేదంటే పొత్తులో వెళ్తేనే బెటరా అనే అంశంలో ముఖ్యంగా భేటీలో చర్చించబోతున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం పొత్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ముందు నుంచి జనసేన, బీజేపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సుముఖంగానే ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కలిసి నడిచేందుకు ఒప్పుకోలేదు. వస్తే జనసేనతో వస్తాం.. లేదంటే ఒంటరిగా వెళ్తామంటూ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా సందర్భాల్లో చెప్పారు.
కానీ అధ్యక్ష మార్పు జరిగిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. హైకమాండ్ నిర్ణయం మేరకే పొత్తులు ఉంటాయని చెప్పారు. ఒక రకంగా చూస్తే మూడు పార్టీలు పొత్తులో కలిసి వెళ్లడమే బెటర్ అనే వాదనలు కూడా ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా దాదాపు మూడు పార్టీలు పొత్తులో వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పురందేశ్వరి చంద్రబాబుకు బంధువు అవడం, మూడు పార్టీలు కలిసి వెళ్తేనే పార్టీకి లాభం చేకూరే పరిస్థితి ఉండటంతో.. దాదాపుగా మూడు పార్టీల పొత్తు ఖరారవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సిచ్యువేషన్‌లో భేటీ అనంతరం హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతోంది అనే విషయం ఆసక్తిగా మారింది.