Somu Veeraju: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తొలగింపు.. ఎందుకు తొలగించారు.. నెక్ట్స్ ఎవరు.?
తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీజేపీ. పార్టీలో కీలక మార్పులు చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పు ఖాయంగా కనిపిస్తోంది. నెక్ట్స్ ఎవరు అన్న దానిపై కూడా బీజేపీ హైకమాండ్ నుంచి లీక్‌లు వచ్చేశాయ్ దాదాపుగా !
దేశంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు తెలంగాణలో బీజేపీకి ఎదురవుతున్నాయ్. అలకలు, అసంతృప్తులు.. అసహనాలు రచ్చరచ్చగా మారింది పార్టీ పరిస్థితి. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో బీజేపీది ఇంకో రకం పరిస్థితి. జాకీలు వేసి లేపినా.. లేవలేని పరిస్థితి అన్నట్లు తయారయింది అక్కడ! ఒక్క పార్టీ మూడు గ్రూపులు అన్నట్లుగా విడిపోయింది ఏపీలో బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మార్పులు చేయాలని డిసైడ్ అయింది. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుకు ఫోన్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
నిజానికి అధ్యక్షుడిగా సోమువీర్రాజు టర్మ్ ఎప్పుడో ముగిసింది. మొదటిసారి కంటిన్యూ చేసిన హైకమాండ్.. ఈసారి మాత్రం మార్పు ఖాయం అని సంకేతాలు ఇచ్చింది. నిజానికి ఇంకొన్ని రోజులు సోమువీర్రాజు అధ్యక్షుడిగా కొనసాగే సమయం ఉంది. ఐతే హైకమాండ్ మాత్రం మార్పు జరగాల్సిందే అని ఫిక్స్ అయింది. సోమువీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ బౌన్స్ అవడం కాదు కదా.. మరింత వీక్ అయిన పరిస్థితి. గ్రూపు తగాదాలు పెరిగిపోయాయ్. జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. అదే పార్టీ మీద సోము స్వయంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇక పార్టీలోనూ సోము వీర్రాజు మీద కొందరు రివర్స్ అయ్యారు.
కట్ చేస్తే కన్నాలాంటి వారు పార్టీ మారారు. ఇంకొందరు అలాంటి అసంతృప్తితోనే ఉన్నారు. ఇవన్నీ లెక్కలేసుకున్న బీజేపీ హైకమాండ్.. అధ్యక్షుడిని మార్చడమే బెటర్ అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఏపీ బీజేపీకి తర్వాత అధ్యక్షుడిగా సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సత్యకుమార్ పేరు దాదాపు ఖరారు అయినా.. పార్టీలోని కొన్ని వర్గాలు ఆయన మీద వ్యతిరేకతతో ఉన్నాయ్. దీంతో ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనాచౌదరి పేరును కూడా పార్టీలో కొందరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఏమైనా ఈ మార్పులైనా పార్టీని గాడిలో పెడతాయో లేదో చూడాలి మరి.