BJP: భారీ ప్రక్షాళన దిశగా బీజేపీ..? తెలుగు రాష్ట్రాలపై ఫోకస్.. అధ్యక్షుల మార్పుపై చర్చ..!
జూలై, 3, సోమవారంనాడు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ.. అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వంలో, పార్టీలో చేయబోతున్న మార్పుల గురించి వివరిస్తారు
BJP: దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతోపాటు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూలై, 3, సోమవారంనాడు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ.. అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వంలో, పార్టీలో చేయబోతున్న మార్పుల గురించి వివరిస్తారు.
దీంతో బీజేపీ కార్యవర్గంతోపాటు, కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు జరగబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో అమిత్ షా, జేపీ నద్దాతోపాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఈ సమావేశం తర్వాత కొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిస్థానంలో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు చెందిన నేతలను ఎంపిక చేస్తారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి కలిసొస్తుందని అంచనా. పార్టీ సీనియర్లు, తొలగించిన మంత్రులకు ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈసారి మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్
తెలుగు రాష్ట్రాలపై కూడా బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. బీఆర్ఎస్ కూడా నెమ్మదిగా తన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. బీజేపీ మాత్రం కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. అందుకే తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా అధ్యక్షుడి మార్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను తొలగించి కిషన్ రెడ్డి లేదా లక్ష్మణ్.. ఎవరో ఒకరిని అధ్యక్షుడిని చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. బండికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోంది. అయితే, ఈ విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. సోమవారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏపీకి అధ్యక్షుడి మార్పు
ఏపీలోనూ పవన్ వారాహి యాత్రతో రాజకీయం రంజుగా మారుతోంది. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ కూడా దూసుకెళ్తోంది. అయితే, ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యేకదృష్టి పెట్టింది. ముఖ్యంగా అధ్యక్షుడు సోము వీర్రాజు మార్పుపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికీ అవకాశం ఉండబోదు. కానీ, సోము వీర్రాజును మార్చే అవకాశాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. వీరితోపాటు ఒకరిద్దరి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై కూడా అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది.