Bandi Sanjay: బండికి కేంద్ర మంత్రి పదవి.. డీకే అరుణకు అధ్యక్ష పదవి.. తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు..?

పార్టీని బండి బాగానే నడిపిస్తున్నప్పటికీ.. నేతలను కలుపుకొని పోవడం లేదనే విమర్శ ఉంది. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుంది. అందుకే అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 06:49 PMLast Updated on: Jun 10, 2023 | 6:49 PM

Bjp High Command Wants To Change Party President In Telangana Bandi Gets A Portpholio In Central Govt

Bandi Sanjay: కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉంటున్న తెలంగాణ బీజేపీలో మళ్లీ ఊపు తెచ్చేందుకు కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్ని సంక్షోభాన్ని నివారించడంతోపాటు, పార్టీని గాడిలో పెట్టాలంటే మార్పులు చేయడం ఒక్కటే మార్గం అని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. దీని ప్రకారం అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీ నేతల మధ్య అంతర్గత విబేధాలు ఎక్కువయ్యాయి. దీంతో నేతలు ఎవరిదారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పైగా కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. మరోవైపు బండి సంజయ్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు ఇటీవల హోం మంత్రి అమిత్ షా, జేపీ నద్దా సహా ఢిల్లీ పెద్దలను కలిశారు.

పార్టీ పరిస్థితిని వివరించారు. ప్రధానంగా బండి సంజయ్‌పై అనేక ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీని బండి బాగానే నడిపిస్తున్నప్పటికీ.. నేతలను కలుపుకొని పోవడం లేదనే విమర్శ ఉంది. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుంది. అందుకే అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనుకుంటోంది అధిష్టానం. అలాగే బండి సంజయ్‌కు కేంద్రంలో పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ ప్రచార సారథిగా ఈటలను నియమించాలనుకుంటోంది అధిష్టానం. అలాగే ఇతర అసంతృప్త నేతలకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించనుంది.
అసలు సమస్య ఎక్కడ..?
టీ బీజేపీలో పేరున్న నేతలు చాలా తక్కువ మంది. దీంతో వలసల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొంతకాలం నుంచి ఇతర పార్టీల నుంచి వరుసగా చేరుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీలో ప్రధానంగా వారినుంచే సమస్య వస్తోంది. పార్టీలో ఇమడలేకపోతున్నారు. పార్టీ కూడా వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్లంతా హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. బండి సంజయ్ తీరుతోపాటు, అంతర్గత విబేధాలపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోకపోవడం వల్లే ఈ సమస్య అని పార్టీ వర్గాలు అంటున్నాయి.ఈ నేపథ్యంలో పార్టీలో మార్పులు చేయడమే సరైనదని భావించి, కీలక మార్పులకు దిగబోతుంది. ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ జరిగే లోపలే ఈ అంశంపై స్పష్టత వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఎన్నికల వేళ ప్రత్యేక దృష్టి..
ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయి. ఆ లోపే పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధం కావాల్సి ఉంది. అందుకే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్ని చక్కదిద్దాలని భావిస్తోంది. పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.