T BJP: తెలంగాణ బీజేపీలో సంక్షోభం ముగిసేనా..? పార్టీ ఇక కోలుకోదా..?

బీజేపీకి రెండేళ్లుగా ఉన్న ఊపు ఇప్పుడు తగ్గిపోయింది. ఇది జనాల్లో కాదు.. నేతల్లోనే వెల్లడవుతున్న అభిప్రాయం. బండి సంజయ్ తెలంగాణ బాధ్యతలు తీసుకున్నాక పార్టీలో జోష్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2023 | 08:25 PMLast Updated on: Sep 28, 2023 | 8:25 PM

Bjp In Telangana Losing Hopes Cadre Angry On Leaders

T BJP: తెలంగాణ బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. గత ఏడాది వరకు బీఆర్‌‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన పార్టీ తీరా ఎన్నికల ముంగిట డీలా పడిపోవడం శ్రేణులకు అంతుచిక్కడం లేదు. బండి సంజయ్ నాయకత్వంతో అనూహ్యంగా ఎదిగిన బీజేపీ.. అంతకు మించిన వేగంతో పతనం కావడం పార్టీ నాయకుల్ని షాక్ కు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది.
బీజేపీకి రెండేళ్లుగా ఉన్న ఊపు ఇప్పుడు తగ్గిపోయింది. ఇది జనాల్లో కాదు.. నేతల్లోనే వెల్లడవుతున్న అభిప్రాయం. బండి సంజయ్ తెలంగాణ బాధ్యతలు తీసుకున్నాక పార్టీలో జోష్ వచ్చింది. వరుస కార్యక్రమాలతో నేతలు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. అధికార బీఆర్ఎస్‌ను ఒక దశలో వణికించారు కూడా. దీంతో నెమ్మదిగా ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూడటం మొదలుపెట్టారు. అధికార బీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ గూటికి చేరారు.

ఇక బీజేపీ హవా మొదలైంది అనుకున్న సమయంలో అనేక కుదుపులకు లోనైంది పార్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహం వచ్చింది. ఇదే సమయంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. అధ్యక్షుడు బండిపై ఈటల, విజయశాంతి నేతల ఫిర్యాదుతో బండిని తొలగించి, కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసింది. అంతే.. బీజేపీ చతికిలపడిపోయింది. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాక బీజేపీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. బండిని తప్పించారని సంతోషించిన నేతలకు కూడా ఇప్పుడు సంతోషం లేకుండా పోయింది. కారణం.. పార్టీకి జనాల్లో ఆదరణ తగ్గడమే. నెమ్మదిగా బీజేపీ బలహీనపడింది. ఇంతకాలం ఆ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది.
అధికారంలో ఉండి ఏం లాభం..
ఒకప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువ. అలాంటిది రెండుసార్లు వరుసగా కేంద్రంలో మెజారిటీ సాధించి అధికారం చేపట్టింది. దీంతో బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. దీనికి ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతల కరిష్మానే కారణం. తొమ్మిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో బలపడింది. అయితే, తెలంగాణలో మాత్రం పుంజుకోలేకపోయింది. బండి అధ్యక్షుడిగా ఉన్న కొంతకాలమే బీజేపీకి ఆదరణ దక్కింది. అయితే, మోదీ, అమిత్ షా వంటి నేతలున్న సమయంలోనే బీజేపీ పుంజుకోలేదంటే.. ఇక ఆ పార్టీ భవిష్యత్ ఏంటా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ఇమేజ్, హిందూత్వ, బీజేపీ సిద్ధాంతాలు ఏవీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీని కాపాడలేవు. పార్టీ పెద్దలు ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా పార్టీ బలోపేతం కావడం లేదు.

నేతల అసంతృప్తి.. జంప్ చేస్తారా..?
కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయినప్పటికీ కొందరికి పార్టీలో ఇంకా సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. మరోవైపు పార్టీకి ఆదరణ దక్కడం లేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ పార్టీలో ఎలాంటి సందడి కనిపించడం లేదు. జనంలోకి తీసుకెళ్లే నేతలు కనిపించడం లేదు. దీంతో పార్టీ తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే.. ఇక తెలంగాణపై బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే.
పార్టీ నాయకత్వంపై ఆగ్రహం
తెలంగాణలో బీజేపీ బలహీనపడటానికి పార్టీ పెద్దల వైఖరే కారణమని తెలంగాణ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న బండిని ఉన్నట్లుండి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకాలం పార్టీని నమ్ముకుని పని చేసిన తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాయి.