Kishan Reddy: బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే.. నేతలంతా ఒక్కటే.. బీజేపీ నేతల స్పష్టీకరణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధ్యక్షుడు బండి సంజయ్, కీలక నేత ఈటల రాజేందర్‌తోపాటు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై స్పందించారు. తామంతా కలిసే ఉన్నామని, వేదికపై కూడా కలిసే కనిపిస్తున్నామని, విబేధాలు లేవని, పార్టీపై దుష్ప్రచారం అంతా ఒట్టిదేనని నేతలు అన్నారు.
Kishan Reddy: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య లుకలుకలు, బేధాభిప్రాయాలు, బండి సంజయ్ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని, తామంతా ఒక్కటిగానే ఉన్నామని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధ్యక్షుడు బండి సంజయ్, కీలక నేత ఈటల రాజేందర్‌తోపాటు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని వివరించారు. ఈ నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కిషన్ రెడ్డి, ఈటల, బండి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై స్పందించారు. తామంతా కలిసే ఉన్నామని, వేదికపై కూడా కలిసే కనిపిస్తున్నామని, విబేధాలు లేవని, పార్టీపై దుష్ప్రచారం అంతా ఒట్టిదేనని నేతలు అన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ ”కాంగ్రెస్ పార్టీ కిరాయి దుకాణం లాంటిది.
కేసీఆర్ దృష్టిలో కాంగ్రెస్ అంటేనే షాపింగ్ మాల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాస్ట్లీ మెటీరియల్ వచ్చి చేరింది. కేసీఆర్ దగ్గర డబ్బుకు కొదువ లేదు. ఎంత డబ్బైనా సరే కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక వరకు బీఆర్ఎస్‌పై పోటీ చేసి గెలిచింది బీజేపీనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోపాటు తోక పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ రెండు సీట్లే గెలుచుకుంది. హైదరాబాద్‌లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. దొరలు, గడీల పాలన అంతమొందించి, రామరాజ్యాన్ని స్థాపించడమే బీజేపీ లక్ష‌్యం. తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ కూడా ఇదే రిపోర్టు ఇచ్చింది” అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ”దేశాభివృద్ధి కోసం బీజేపీ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతుల కోసం అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణకే ఎక్కువ నిధులు ఇస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు బీజేపీపై బురదజల్లుతున్నారు. గిరిజన యూనివర్సిటీ నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. స్థలం కేటాయించాలంటూ ఎన్ని లేఖలు రాసినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు స్థలం కేటాయించలేదు. స్థలం ఇస్తే నిర్మాణం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరంగల్ జిల్లాకు డిఫెన్స్ స్కూల్ కేటాయిస్తే ఇప్పటివరకు స్థలం మంజూరు చేయలేదు. స్థలం ఇస్తే వరంగల్‌లో సైనిక్ స్కూల్ నిర్మిస్తాం. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు, ఓఆర్ఆర్, ట్రిపులార్ నిర్మాణాల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం సహకరిచడం లేదు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా.. బీఆర్ఎస్ మాపై దుష్ప్రచారం చేస్తోంది. బయ్యారం ఉక్కు పరిశ్రమను తామే నిర్మిస్తామని రాష్ర ప్రభుత్వం చెప్పింది. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించాలి” అని కిషన్ రెడ్డి అన్నారు.
వరంగల్‌లో జరిగిన ఈ సమావేశం ద్వారా చాలా కాలం తర్వాత కిషన్ రెడ్డి, బండి, ఈటల కలిసి కనిపించారు. దీంతో నేతల మధ్య బేధాభిప్రాయాలు నిజమేనా.. దుష్ప్రచారమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ అంశంపై ఇవ్వాళో.. రేపో స్పష్టత రావొచ్చు. బండిని బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.