T BJP: బీజేపీకి ఆ ఆరుగురు హ్యాండ్ ఇవ్వబోతున్నారా.. ఇంతకీ వాళ్ల ప్లాన్ ఏంటి..?

పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఓ ముగ్గురి ద్వారానే జరుగుతున్నాయని.. ఇంకా మిగిలిన వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. సీనియర్ నేత వివేక్ ఇంట్లో ఆ మధ్య కొంతమంది నేతలు సమావేశం అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2023 | 03:59 PMLast Updated on: Sep 27, 2023 | 3:59 PM

Bjp Leaders In Telangana Giving Shock To Party

T BJP: బీఆర్ఎస్‌‌కు పోటీ మేమే.. అధికారంలోకి రాబోయేది మా పార్టీయే.. ఇకపై.. అద్భుతాలు చూస్తారు.. డబుల్ ఇంజిన్ సర్కార్‌ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేస్తాం.. ఇదీ మూడు నెలల ముందు వరకు తెలంగాణ బీజేపీలో కనిపించిన ఉత్సాహం. కట్‌ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. హడావుడి స్థానంలో అలసట కనిపిస్తోంది. నిరాశ వినిపిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంతో.. తెలంగాణలోనూ కాషాయం పార్టీ డీలా పడింది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు.. కాషాయం పార్టీని కషాయం మింగేలా చేస్తున్నాయ్.

బీజేపీ నేతల మధ్య నెలకొన్న అనిశ్చితి, విభేదాలు, వర్గపోరు.. ఇలా, రోజుకో సమస్య తెరమీదకు వస్తోంది. దీంతో కమలం పార్టీ పరిస్థితి తెలంగాణలో అస్తవ్యస్తంగా మారింది. అమిత్ షా ప్రత్యేకంగా నజర్ పెట్టి.. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదీ పెద్దగా సక్సెస్‌ కావడం లేదు. ఆ మధ్య ప్రాధాన్యం కోసం ఈటల అలకపాన్పు ఎక్కితే.. తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని రఘునందన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పదవుల విషయంలో అధిష్టానం చొరవ తీసుకొని మార్పులు చేపడితే.. ఇప్పుడు మరికొంత మంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఓ ముగ్గురి ద్వారానే జరుగుతున్నాయని.. ఇంకా మిగిలిన వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. సీనియర్ నేత వివేక్ ఇంట్లో ఆ మధ్య కొంతమంది నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌ పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయట పెట్టింది. ఇక అక్టోబర్‌ 1న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరికొంత మంది బీజేపీ నేతలు.. విజయశాంతి ఇంట్లో సమావేశం కావడం చర్చకు దారి తీస్తోంది. ఈ మీటింగ్‌లో విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు. దీంతో మోదీ తెలంగాణ పర్యటన వేళ.. వీళ్లంతా బీజేపీకి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. వీరంతా పార్టీ మారతారనే సందేహాలు వినిపిస్తున్నాయ్. తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు పార్టీలో సీనియర్లను గుర్తించాలనే ప్రతిపాదనను.. ఆయన ముందుంచే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మోదీ నుంచి ఏ మాత్రం సానుకూల స్పందన రాకపోయినా.. వీళ్లంతా కాషాయ పార్టీకి టాటా చెప్తారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో ఈ ఆరుగురు ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతారన్నది ఆసక్తికరంగా మారింది.