BJP Loksabha Tickets : జహీరాబాద్ సీట్ కోసం బీజేపీలో ఆరుగురు పోటీ !
బీజేపీలో జహీరాబాద్ ఎంపీ సీటు హాట్ అయిపోయింది. అభ్యర్థులుగా నిన్నటి దాకా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తే... ఇప్పుడు ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారట. కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల టైంలోనే తెలంగాణ మీద ఫోకస్ పెంచిన బీజేపీ ఈసారి లోక్‌సభ ఎలక్షన్స్ కోసం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టే వివిధ నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. సంగారెడ్డి జిలాల్లోని జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం ఏకంగా ఆరుగురు పోటీ పడుతుండటాన్ని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడింటిలో నాలుగు సీట్లు కాంగ్రెస్, రెండు BRS, ఓ అసెంబ్లీ సీటును బీజేపీ గెల్చుకున్నాయి. అయినా అసెంబ్లీ ఫలితాలతో నిమిత్తం లేకుండా… జహీరాబాద్ ఎంపీ సీటు మీద రకరకాల లెక్కలతో సిద్ధమైపోతున్నారట ఆశావహులు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు కమలం పార్టీకే మద్దతుగా నిలుస్తారని, మోదీ చరిష్మా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈసారి జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ సీటును కొత్త వారికి ఇచ్చి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే… రెండు చోట్లా గెలవవచ్చన్న అభిప్రాయం పార్టీ పెద్దలకు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి ఆలే నరేంద్ర కొడుకు భాస్కర్, మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, బోధన్ కి చెందిన బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి, గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కూడా ఈసారి జహీరాబాద్ రేస్‌లో ఉన్నారట. అంతకు ముందుతో పోలిస్తే…. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్లు పెరగడాన్ని కూడా పాజిటివ్‌గా చూస్తున్నారు కాషాయ నేతలు. మరో వైపు నియోజకవర్గం పరిధిలోని లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు తమకే సాలిడ్ అవుతాయని నమ్ముతోంది బీజేపీ. మైనార్టీ ఓట్ల చీలిక మీద కూడా ఆశలున్నాయట. ఇలా రకరకాల లెక్కలతో ఎవరికి వారు ఢిల్లీదాకా పైరవీలు చేసుకుంటున్నారు. చివరికి బరిలో నిలిచేది ఎవరో చూడాలి.