Telangana BJP: అనుకున్నదొకటి.. అవుతోంది ఒకటి.. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవా..?

కర్ణాటక ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఢీకొట్టి.. కమలం సత్తా ఏంటో చూపిస్తామని భావించిన కాషాయం పార్టీ నేతలకు.. వరుస పరిణామాలు కషాయం మింగినట్లు చేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 11:44 AMLast Updated on: May 31, 2023 | 12:21 PM

Bjp Losing Its Hopes In Telangana Due To This Reason

Telangana BJP: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన యుద్ధం బీఆర్ఎస్, బీజేపీ మధ్యే.. అధికారం ఎవరో తేల్చుకోవాల్సింది రెండు పార్టీలే అన్నట్లుగా కనిపించింది మొన్నటిదాకా. ఐతే ఇదంతా గతం. నెలరోజుల కింద ముచ్చట ఇది. కట్ చేస్తే కర్ణాటక ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఢీకొట్టి.. కమలం సత్తా ఏంటో చూపిస్తామని భావించిన కాషాయం పార్టీ నేతలకు.. వరుస పరిణామాలు కషాయం మింగినట్లు చేస్తున్నాయి.

వస్తారనుకున్న వాళ్లు రాకపోగా.. పోనీ ఉన్న వాళ్లయినా ఉంటారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. బీజేపీలో కొందరి మాటలు, తీరు చూస్తుంటే కనిపిస్తున్న, వినిపిస్తున్న అనుమానం ఇదే. దీంతో అనుకున్నది ఒకటి.. అవుతోంది ఒకటి అన్నట్లుగా బీజేపీ తీరు కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో.. తెలంగాణ బీజేపీకి ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా క్లియర్ అయినట్లు అయింది. చేరే వాళ్లు ఎవరూ చేరకపోగా.. అందులో ఉన్న నేతల్ని కూడా.. వేరే నేతలు మోటివేట్ చేసి.. ఆ పార్టీలో ఎందుకు.. కాంగ్రెస్ పార్టీలోకి పోదాం రండి అని చర్చించుకునేలా పరిస్థితిని మార్చేసింది. ఈటలతో పొంగులేటి, జూపల్లి చర్చలో జరిగింది అదే. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

జూపల్లి కృష్ణారావు, పొంగులేటి.. జూన్ రెండో వారంలో కాంగ్రెస్‌లో చేరుతారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా అధికార బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్‌ వినిపిస్తోంది. బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ గురించి ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. నిన్నగాక మొన్న బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానని కబురు పంపుతున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారు చేస్తే.. టిక్కెట్ దొరకని ప్రముఖ నేతలంతా బీజేపీలోకి వస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడంతా వారు.. హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలాంటి వాళ్ల విషయంలో ఈ ప్రచారం మరింత గట్టిగా వినిపిస్తోంది. కాంగ్రెస్ కూడా.. ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రేంజ్‌లో.. బలమైన నేతలు ఎవరు కూడా గ్రిప్‌లో నుంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. చాప కింద నీరులా పనికానిచ్చేస్తోంది. నేతల్ని గాంధీ భవన్‌కు లాక్కొచ్చేస్తోంది. దీనంతటికీ ప్రధాన కారణం.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయమే. ఇది హస్తం పార్టీ నేతలకు జోష్ ఇవ్వడమే కాదు.. బీజేపీ నేతలను మానసికంగా దెబ్బతీసింది. కమలం పార్టీ మీద వ్యతిరేకత ప్రారంభం అయిందనే సంకేతాలను జనంలోకే కాదు.. సొంత పార్టీలోకి తీసుకెళ్లింది. ఆ ప్రభావమే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ వేసిన ప్రతీ ప్లాన్ ఫెయిల్ అవుతోంది. మరి ఇప్పుడు కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి? మళ్లీ రేసులోకి వచ్చేందుకు ఏం చేయబోతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.