Janasena: కలిసి పోటీ చేస్తారు సరే.. వారాహి యాత్రకు మద్దతు ఇవ్వరా.. బీజేపీ వైఖరేంటి..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు దశల యాత్ర పూర్తి చేసుకుని, విశాఖలో మూడో దశ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి మద్దతూ కనిపించడం లేదు.
Janasena: ఏపీలో తాము జనసేనతో కలిసున్నామని బీజేపీ చెబుతుంటుంది. నాలుగేళ్లుగా కలిసే ఉన్నామని చెబుతున్నా.. కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ టైంలో కూడా కలవకుంటే అర్థం ఏంటి..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు దశల యాత్ర పూర్తి చేసుకుని, విశాఖలో మూడో దశ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి మద్దతూ కనిపించడం లేదు. ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ, పవన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా.. బీజేపీ నుంచి స్పందన రావడం లేదు. మిత్రపక్షంగా జనసేనకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. మరోవైపు రెండు పార్టీలు కలిసి సాగితేనే.. ప్రజల్లో రెండు పార్టీలపై సానుకూలత వ్యక్తమవుతుంది. జనసేన విషయంలో బీజేపీ నుంచి సరైన స్పందన లేకున్నప్పటికీ.. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలకు కొన్నిచోట్ల జనసేన మద్దతు లభిస్తోంది. పంచాయతీ నిధులను దారి మళ్లించినందుకు వ్యతిరేకంగా గతంలో బీజేపీ చేపట్టిన ధర్నాలకు జనసేన మద్దతు పలికింది. ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల బీజేపీతోపాటు జనసేన కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ తర్వాత తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బీజేపీ కార్యక్రమాల్లో జనసేన, జనసేన కార్యక్రమాల్లో బీజేపీ కనిపించలేదు. రెండు పార్టీలూ పొత్తులో ఉన్నామని చెప్పుకొంటూ ఉంటారు. కానీ కలసి పని చేయడంలేదు. కారణం.. ఇంతకాలం బీజేపీపై నమ్మకం లేకపోవడమే.
ఇప్పుడైనా మారుతారా..?
గతంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. అందుకే పవన్ కూడా బీజేపీపై అంతగా ఆసక్తి చూపలేదు. పైగా తనకు కేంద్ర నాయకత్వంతో సంబంధాలున్నాయని, కానీ రాష్ట్ర బీజేపీ నేతలతో మాత్రం సంబంధాలు లేవని చెప్పారు. అయితే, ఇప్పుడు సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేనతో కలిసి సాగుతామన్నారు. పవన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని, రాష్ట్రంలో కలిసి పని చేస్తామని వెల్లడించారు. దీంతో జనసేన నేతలు బీజేపీ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పోరాటాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీపై పోరాడటంలో పురందేశ్వరి రాజీ పడరని భావించడంతోనే పవన్ భావిస్తున్నారు. అందుకే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కానీ, వారాహి యాత్రలో మాత్రం బీజేపీ నుంచి సరైన సహకారం లభించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అదే రెండు పార్టీలు కలిసి సాగితే మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైసీపీకి ఇబ్బందిగా కూడా మారుతుది. ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.