Jagan – BJP: జగన్‌కు, బీజేపీకి మధ్య చెడిందా..? సీబీఐ దూకుడు వెనుక కేంద్రం హస్తముందా..?
వివేకా హత్య కేసు వ్యవహారం చూసిన తర్వాత బీజేపీకి, వైసీపీకి మధ్య పెద్ద సఖ్యత లేదని అర్థమవుతోంది. బహుశా అందుకే జగన్ అన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారేమో..! అయినా నో యూజ్..!!
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఎవరిని సీబీఐ అరెస్టు చేస్తుందో కూడా అంతు చిక్కడం లేదు. ఇన్నాళ్లూ వై.ఎస్. అవినాశ్ రెడ్డి కుటుంబానికి ప్రమేయం ఉందని సీబీఐ వాదిస్తూ వచ్చింది. అవినాశ్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే అవినాశ్ రెడ్డి వివిధ కారణాలతో అరెస్టు కాకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కేసు వ్యవహారం అవినాశ్ రెడ్డిని దాటి జగన్ వరకూ వచ్చేసింది. హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన తాజా కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉంది.
వై.ఎస్.అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సునీతా రెడ్డి, సీబీఐ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇందులో సీఎం జగన్ పేరు ఉండడమే ఇందుకు కారణం. వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం 6.45కు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారని ఇన్నాళ్లూ తెలుసు. అయితే అంతకుముందే అవినాశ్ రెడ్డితో పాటు జగన్ కు కూడా వివేకా హత్య విషయం తెలుసని సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది. ఇదే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
వివేకా హత్య కేసు తన కుటుంబం వరకూ రావడంతో జగన్ కాస్త ఆందోళన పడుతున్న మాట వాస్తవం. అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమని అందరికీ అర్థమైపోయింది. దీంతో ఆయన్ను కాపాడుకునేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నించారు. ఢిల్లీకి రెండు మూడు దఫాలు వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. తమకు సాయం చేయమని కోరారు. బీజేపీ పెద్దల అండ జగన్ కు పుష్కలంగా ఉందని, అందుకే అవినాశ్ రెడ్డి అరెస్టు కాబోరని వైసీపీ నేతలు భావించారు. సీబీఐ, అవినాశ్ రెడ్డి… కలిసే ఈ డ్రామా అంతా ఆడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేయడం ప్రారంభించాయి.
అయితే సీబీఐ కౌంటర్లు చూసిన తర్వాత బీజేపీకి, వైసీపీకి మధ్య అంత సీన్ లేదని అర్థమవుతోంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి పేరును కూడా సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది. అంతేకాక ఆయన్ను కూడా విచారించాల్సి ఉందని పేర్కొంది. దీన్నిబట్టి ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోలేదని అర్థమవుతోంది. ఒకవేళ నిజంగా బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని సాయం చేసి ఉంటే ఇందులో జగన్ పేరు బయటకు రాకపోయి ఉండొచ్చు. అవినాశ్ రెడ్డితో ఆగిపోయి ఉండొచ్చు. కానీ అలా జరగట్లేదు. సీబీఐ తగ్గేదే లేదంటూ దూసుకెళ్తోంది. మొత్తానికి వివేకా హత్య కేసు వ్యవహారం చూసిన తర్వాత బీజేపీకి, వైసీపీకి మధ్య పెద్ద సఖ్యత లేదని అర్థమవుతోంది. బహుశా అందుకే జగన్ అన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారేమో..! అయినా నో యూజ్..!!