Politics: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఏలేటి.. తెలంగాణలో ఇక కాంగ్రెస్ లేనట్టేనా ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓ రేంజ్‌లో బ్యాడ్ టైం నడుస్తోంది. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. కాంగ్రెస్ కీలక నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మహేశ్వర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వర్ రెడ్డికి ఏం చేసింది అన్న విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు మహేశ్వర్ రెడ్డి చాలా హెల్ప్ అయ్యారు. అన్ని రకాలుగా పార్టీని, నేతలను ఆదుకున్నారు.
ఈ కారణంగానే పార్టీ హైకమాండ్ ఆయనకు ఏఐసీసీలో మంచి పదవి ఇచ్చి గౌరవించింది. కానీ.. రీసెంట్‌గా టీపీసీసీలో మారుతున్న పరిణామాల కారణంగా టీపీసీసీకి, మహేశ్వర్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది. రీసెంట్‌గా ఆయన చేస్తున్న పాదయాత్రను టీపీసీసీ అడ్డుకుంది. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో పార్టీకి రాజీనామా చేశారు మహేశ్వర్ రెడ్డి. ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం కూడా లేని ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇది చావు దెబ్బ. చాలా ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు. గట్టిగా మాట్లాడితే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేరు. ఒకవేళ ఉన్నా.. ఎన్నికలకు డబ్బు ఖర్చు పెట్టేందుకు ఎవరూ రెడీగా లేరు.
రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు టీపీసీసీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా వేస్ట్. ముందు ఇంటిని సెట్ చేసుకుని తరువాత రాష్ట్రంలో పరిస్థితిని మార్చాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్‌కు ఇంట్లోనే పరిస్థితి బాలేదు. కేసీఆర్‌ను కేటీఆర్‌ను టార్గెట్ చేయడం తప్ప.. తెలంగాణలో తమ అజెండా ఏంటి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకువచ్చే సంక్షేమ పథకాలేంటో చెప్పడంలో టీపీసీసీ ఫెయిల్ అయింది. ఇలాంటి టైంలో మహేశ్వర్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ కూడా పార్టీకి దూరమయ్యాడు. తనతో పాటు చాలా మంది పార్టీ మారేందుకు వెయిట్ చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.
మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ తెలంగాణ కాంగ్రెస్‌ను మరింత టెన్షన్ పెడుతోంది. కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉండగా.. మరికొందరు ఎలక్షన్స్ తరువాత జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట. తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టాలని బీఆర్‌ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు బీజేపీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. తెలంగాణలో ప్రతిపక్ష స్థానాన్ని దాదాపుగా భర్తీ చేసింది. ఇప్పుడు అధికార పక్షానికి ఎదురెల్లడమే పెద్ద చాలెంజ్ అంటే.. బీజేపీని బీట్ చేయడం కాంగ్రెస్‌కు మరో టాస్క్‌గా మారింది. అంతర్గత పోరు, పార్టీకి సీనియర్ల రాజీనామాలతో ఆల్మోస్ట్ డెత్‌బెడ్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలక్షన్స్‌ను ఎలా ఫేస్ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మైండ్‌లో ఉన్న టెన్షన్.