Congress Files: కాంగ్రెస్ అవినీతి రూ.4.8 లక్షల కోట్లట…!

ప్రతిపక్షాల ఐక్యతను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు, ప్రజల్లో కాంగ్రెస్ అవినీతిపై చర్చ జరిగేలా ఈ మూడు నిమిషాల వీడియో వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని వదలడం ద్వారా కాంగ్రెస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2023 | 11:43 AMLast Updated on: Apr 03, 2023 | 11:43 AM

Bjp Releases Congress Files Lists Rs 4 8 Lakh Crore Scams In 70 Years

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య పోరాటం ఉధృతమవుతోంది. అదానీ సెంటర్‌గా బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై కమలం ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పాలనలో ఏకంగా 4.8లక్షల కోట్ల రూపాయల అవినీతి (Corruption) జరిగిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ (Congress Files) పేరిట ఓ వీడియోను విడుదల చేసింది.

అదానీ (Adani) అంశాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ అంశంలో బీజేపీ కూడా కొంతమేర డిఫెన్స్‌లో పడింది. పార్లమెంట్ సాక్షిగా మోడీ (Modi) సమాధానం ఇవ్వకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. దాన్ని కవర్ చేసుకునేందుకు కాంగ్రెస్ పాలనలో అవినీతిని కమలం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్‌ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. మూడు నిమిషాల ఈ వీడియోను కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటూ మొదలుపెట్టింది. యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఇందులో ఏకరవు పెట్టింది. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో రూ.48,20,69,00,00,400 కోట్ల మేర అవినీతి జరిగిందని ఇందులో పేర్కొంది. అంటే 4లక్షల 82వేల కోట్లన్న మాట. ప్రజలకు చెందాల్సిన ఇంత సొమ్మును కాంగ్రెస్ నేతలు తినేసారని కమలం ఆరోపించింది. ఇదంతా మీ సొమ్మే, మీ జేబుల్లో సొమ్మే అంటూ ప్రజలను ఆలోచింపచేసేలా ఈ వీడియో ఉంది.

బీజేపీ చెప్పే దాని ప్రకారం కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి సొమ్ముతో 24 ఐఎన్ఎస్ విక్రాంత్‌లు (INS Vikranth) కొనొచ్చు,… 300 రాఫెల్ (Raffale) యుద్ధవిమానాలను సొంతం చేసుకోవచ్చు. 1,000 మంగల్ మిషన్స్ (Mangal Missions) చేపట్టొచ్చు. గత కాంగ్రెస్ పాలనను పక్కన పెట్టినా బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు అంటే 2004-2014 మధ్య దశాబ్ధం పాటు దారుణ అవినీతి జరిగిందని చెప్పుకొచ్చింది. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఎప్పుడూ జరగలేదని ఏ పేపర్ చూసినా అవినీతిపై హెడ్‌లైన్స్ అంటూ ఆరోపించింది బీజేపీ. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పైనా విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన్ను మౌనముని అంటూ కామెంట్ చేసింది. అవినీతి కళ్లెదుట కనిపిస్తున్నా ఆయన మౌనాన్ని పాటించారని ప్రజా సొమ్మును రాబందుల పాలు చేసారంటూ ఘాటుగా కామెంట్లు చేసింది బీజేపీ.

బీజేపీ విడుదల చేసిన వీడియో ప్రకారం చూస్తే….

బొగ్గు కుంభకోణం రూ. 1.86లక్షల కోట్లు
2జీ స్పెక్ట్రమ్‌ స్కామ్ రూ.1.76లక్షల కోట్లు
ఉపాధిహామీ పథకం స్కామ్ రూ.10 లక్షల కోట్లు
కామన్‌వెల్త్ క్రీడల స్కామ్ రూ.70వేల కోట్లు

అంతేకాదు హెలికాప్టర్ డీల్ కోసం రూ.362 కోట్లు లంచం తీసుకున్నారని, రైల్వే బోర్డు ఛైర్మన్ 12కోట్ల రూపాయల మేర లంచం తీసుకుంటూ దొరికిపోయారని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అదానీకి అండగా ఉంటున్నామన్న అపవాదును పోగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే బీజేపీ ఈ వీడియోను విడుదల చేసినట్లు కనిపిస్తోంది. అయితే వీడియో చివర్లో బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ అవినీతి ఇంతటితో అయిపోలేదని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని చెప్పడం ద్వారా త్వరలో మరిన్ని వీడియోలు విడుదల చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. పైగా సీజన్-1 ఎపిసోడ్ -1 అని చెప్పడం ద్వారా ఓ సిరీస్‌లా కాంగ్రెస్ అవినీతిపై వీడియోలు బయటపెట్టడానికి బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్నారని అందుసు సుపారీ కూడా ఇచ్చారని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే ఆరోపించారు. మోడీపై విపక్షాలు తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించాయి. అధికార బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశాయి. రాహుల్ అనర్హత విషయంలో కాంగ్రెస్‌కు దాదాపు అన్ని ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. ప్రతిపక్షాల ఐక్యతను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు, ప్రజల్లో కాంగ్రెస్ అవినీతిపై చర్చ జరిగేలా ఈ మూడు నిమిషాల వీడియో వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని వదలడం ద్వారా కాంగ్రెస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. మరి దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి మరి.