Kiran Kumar Reddy: బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి వైట్ ఎలిఫెంటేనా..?
మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.
బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల బీజేపీకి లాభం జరుగుతుందా.. లేకుంటే బీజేపీ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి లాభపడతారా.. అనే సందేహాలు అనేక మందికి తలెత్తుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉంది. కాంగ్రెస్ వాదిగానే ఆయన గుర్తింపు పొందారు. సైద్ధాంతికంగా బీజేపీ, కాంగ్రెస్ వేరువేరు. అలాంటప్పుడు కాంగ్రెస్ వాది బీజేపీలో ఎలా ఇమడగలరనేది పెద్ద ప్రశ్న.
వేరేవాళ్లయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలో ఇమడడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అలా కాదు. పెద్ద అహంబావి. ఎవరినీ కలుపుకుపోయే రకం కాదు. ఎవరితోనూ కలిసే రకం కూడా కాదు. ఇప్పుడు బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. బీజేపీ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని కలుపుకుపోవడం అంత ఈజీ కాదు. కన్నా లక్ష్మినారాయణ లాంటి నేతలే బీజేపీలో ఇమడలేకపోయారు. అలాంటిది కిరణ్ కుమార్ రెడ్డి మనుగడ సాధించగలరని అస్సలు ఊహించలేం. కిరణ్ కుమార్ రెడ్డి ఇగోను తట్టుకోవడం బీజేపీ నేతలకు కూడా పెద్ద సవాలే.
కిరణ్ కుమార్ రెడ్డి కరుడుగట్టిన సమైక్యవాది. రాష్ట్ర విభజనను చివరి నిమిషం వరకూ అడ్డుకున్న వ్యక్తి. ఓవర్ అయిపోయినా కూడా లాస్ట్ బాల్ కు సిక్స్ కొడతానని గాంభీర్యాలు పలికిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి కరుడుగట్టిన సమైక్యవాదిని తెలంగాణ నుంచి బరిలోకి దంచటమంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు. అదే జరిగితే ఎన్నికలకు ముందే ఓటమిని తెచ్చి పెట్టుకున్నట్టే.
కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ నేతలు చాలా మంది బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు. ఆ పార్టీలో లీడర్లే లేరు. ఉన్న కొద్ది మంది కూడా కిరణ్ కుమార్ రెడ్డిని చూసి వచ్చే రకం కాదు. ఇక రెడ్డి సమాజికవర్గం కిరణ్ కుమార్ రెడ్డిని ఏనాడూ తమవాడిగా గుర్తించలేదు. దీంతో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం కూడా అసాధ్యం. మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.