Target KCR: టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ సీట్స్.. బీజేపీ భారీ స్కెచ్..!

కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు పోటీ చేసే స్థానాల్లో బరిలోకి దిగనున్న 15 మంది అభ్యర్థులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. అవన్నీ సంచలన అభ్యర్ధిత్వాలే అనే టాక్ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2023 | 07:24 PMLast Updated on: Sep 01, 2023 | 7:24 PM

Bjp Targets Cm Kcrs Family Seats In Upcoming Elections

Target KCR: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీచేసే స్థానాలే ప్రధాన టార్గెట్‌గా బీజేపీ భారీ స్కెచ్ గీస్తోంది. గట్టిపోటీని ఇవ్వగలిగే అభ్యర్థులను ఆయా సెగ్మెంట్లలో బరిలోకి దింపడం ద్వారా వారిపై ఒత్తిడిని పెంచాలని పథక రచన చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్‌గా రెడీ అయిపోయిన బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు పోటీ చేసే స్థానాల్లో బరిలోకి దిగనున్న 15 మంది అభ్యర్థులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. అవన్నీ సంచలన అభ్యర్ధిత్వాలే అనే టాక్ వినిపిస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయడానికి రెడీ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ చాలాకాలంగా చెబుతున్నారు. అంతేకాదు ఆయన తరుచుగా గజ్వేల్‌కు వెళ్లొస్తున్నారు.

కేసీఆర్ ఇలాఖాలో ఈటల ఎంతమేరకు ఓట్లను సంపాదించగలరనే దానిపై సర్వత్రా ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. ఇక కేటీఆర్ ఇలాఖా సిరిసిల్ల నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి వేములవాడ నుంచి బండి సంజయ్‌కు ఛాన్స్ ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ.. అక్కడి నుంచి బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు పోటీ చేయనుండటంతో ఛేంజ్ జరిగింది. కేటీఆర్‌పై సంజయ్ పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం సూచించిందని సమాచారం. ఇక కామారెడ్డిలో కేసీఆర్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య్ గౌడ్ లేదా మురళీధర్‌రావును నిలబెట్టాలనే యోచనలో కమలదళం ఉంది.
మంత్రుల ఇలాఖాలలో టైట్ ఫైట్..
ఇతర బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల సెగ్మెంట్లపై కూడా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌పై డీకే అరుణను పోటీకి దింపే ఆలోచనలో ఉన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
ముఖ్య నేతలను ఒత్తిడిలోకి నెడితే..
బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఒత్తిడిలోకి నెడితే.. ఇతర సునాయాస స్థానాల్లో అడ్వాంటేజ్ లభిస్తుందని కమలదళం భావిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 15 మంది బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల్లో కనీసం సగం మందినైనా ఓడించగలిగితే.. నైతిక విజయాన్ని సాధించినట్టు అవుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయనున్న బీజేపీ కీలక నేతలు ఒకవేళ ఓడిపోయినా.. వారికి లోక్‌సభ టికెట్స్ ఇస్తామని జేపీ నడ్డా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి శక్తి, సామర్థ్యాలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయాలని బీజేపీ నేతలకు నడ్డా సూచించారని సమాచారం.