Bypoll Results: ఉప ఎన్నికల్లో విజయం ఎవరిది..? ఇండియా కూటమిదా.. బీజేపీదా..?

ఏడింట్లో మూడు స్థానాల్ని బీజేపీ గెలుచుకోగా, మిగిలిన నాలుగు స్థానాలు ఇండియా కూటమికి చెందిన పార్టీలు గెలుచుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని ధుంప్‌గురి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలో అధికార టీఎంసీ విజయం సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2023 | 09:00 PMLast Updated on: Sep 08, 2023 | 9:00 PM

Bjp Wins 3 Seats India Alliance Parties Get Four Seats

Bypoll Results: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో మిశ్రమ ఫలితం కనిపించింది. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఏడింట్లో మూడు స్థానాల్ని బీజేపీ గెలుచుకోగా, మిగిలిన నాలుగు స్థానాలు ఇండియా కూటమికి చెందిన పార్టీలు గెలుచుకున్నాయి.

పశ్చిమబెంగాల్‌లోని ధుంప్‌గురి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలో అధికార టీఎంసీ విజయం సాధించింది. కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం, దివంగత చాందీ ఊమెన్ కుమారుడు ఊమెన్ చాందీ గెలుపొందారు. జార్ఖండ్‌లోని దుమ్రి స్థానంలో సిట్టింగ్ పార్టీ జేఎంఎం విజయం సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. ఇది అక్కడి అధికార బీజేపీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ స్థానాన్ని, త్రిపురలోని ధన్‌పూర్, బొక్సనగర్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
వచ్చేఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలను ప్రజాభిప్రాయంగా కొన్ని పార్టీలు భావించాయి. అయితే, రెండు కూటమిలకు ఒకటి మినహా సమాన స్థానాలు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఏ కూటమికి పూర్తి సీట్లు దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేను ఎదుర్కునే ఉద్దేశంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. తాజా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునే ఉద్దేశంతో ఇండియా కూటమి పార్టీలకు చెప్పుకోదగ్గ విజయమే దక్కింది. ఈ విజయం ఇండియా కూటమికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చనే నమ్మకాన్ని కలిగించాయని ఇండియా కూటమి వర్గాలు అంటున్నాయి.

కూటమిగా ఏర్పడ్డ తర్వాత కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో సాధించిన తొలి విజయంగా ఈ ఫలితాలను చెప్పుకోవాలి. బీజేపీ ఓడిపోయిన చోట మాత్రం ఇండియా కూటమికి గట్టి పోటీనే ఇచ్చింది. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికనలు లిట్మస్ టెస్ట్‌గా భావించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తే ఈ ఎన్నికలు వాయిదా పడతాయి.