CM Jagan: జగన్‌ వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్ల దాడి.. రెండు పార్టీలకూ చెడిందా?

త్వరలో జగన్‌పై చార్జిషీట్లకు రెడీ అవుతోంది బీజేపీ. దీంతో ఇకపై బీజేపీ-వైసీపీ సమరాన్ని కూడా చూడొచ్చు. అయితే, నిజంగా రెండు పార్టీలకూ చెడిందా? ఈ పరిణామాలు దేనికి సంకేతం. నిన్నటివరకు పాలు-నీళ్లలా కలిసిపోయిన బీజేపీ-వైసీపీకి మధ్య ఇప్పుడు నిజంగానే దూరం పెరిగిందా? లేక ఇదంతా ఒట్టి డ్రామానా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2023 | 04:19 PMLast Updated on: Apr 27, 2023 | 4:20 PM

Bjps Charge Sheets Attack On Jagans Failures

CM Jagan: ఏపీలో బీజేపీ-వైసీపీ రెండూ ఒకటేనని రాష్ట్ర రాజకీయాల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే, ఎక్కడా ఒకరితో ఒకరు కలిసి నడిచినట్లు అనిపించదు. కానీ, లోపాయికారిగా మాత్రం ఇరుపార్టీలూ సహకరించుకుంటాయి. ఏపీలో వైసీపీకి కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుంది. కేంద్రంలోని బీజేపీకి వైసీపీ సహకరిస్తుంది. కేంద్రాన్ని వైసీపీ కానీ, జగన్ కానీ ఒక్క మాటా అనరు. రాష్ట్రంలో వైసీపీని బీజేపీ తూతూ మంత్రంగా విమర్శిస్తూ ఉంటుంది. ఇది చాలు.. రెండు పార్టీలూ ఒకటే అని చెప్పడానికి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా అంటే ఔననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. త్వరలో జగన్‌పై చార్జిషీట్లకు రెడీ అవుతోంది బీజేపీ. దీంతో ఇకపై బీజేపీ-వైసీపీ సమరాన్ని కూడా చూడొచ్చు. అయితే, నిజంగా రెండు పార్టీలకూ చెడిందా? ఈ పరిణామాలు దేనికి సంకేతం.
ఏపీ సీఎం జగన్ పాలన విషయంలో లేదా వైసీపీ విషయంలో కేంద్రంలోని బీజేపీ ఎప్పుడూ పెద్దగా స్పందించింది లేదు. రాష్ట్రంలో జగన్ ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లే లేకుండా పోయారు. కేంద్రం నుంచి సహకారం ఉండటం వల్లే జగన్ తనకు నచ్చినట్లు చేయగలుగుతున్నారని అందరూ నమ్ముతున్నారు. మరోవైపు కేంద్రంపై జగన్ కూడా ఏరోజూ నోరెత్తింది లేదు. రాష్ట్రానికి ఏం వచ్చినా, రాకున్నా, బీజేపీ అన్యాయం చేస్తున్నా జగన్ మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. చాలా అంశాల్లో అనేక రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నా వైసీపీ మాత్రం తమకేం పట్టనట్లే ఉండిపోయింది. అవసరమైనప్పుడు కేంద్రంలో బీజేపీకి సహకరించింది. ఇక జగన్ విషయాన్ని బీజేపీ చూసీచూడనట్లు వదిలేసింది. జగన్ వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ పోరాడింది లేదు. అయితే, ఇప్పుడు ట్రెండు మారుతున్నట్లే కనిపిస్తోంది. జగన్ వైఫల్యాలపై పోరాడేందుకు ఏపీ బీజేపీ సిద్ధమవుతోంది.
జగన్ పాలనపై చార్జిషీట్లు
ఇప్పుడు రాజకీయాల్లో చార్జిషీట్లు ఒక ట్రెండ్. ఒక పార్టీ మరో పార్టీపై చార్జిషీట్లు విడుదల చేస్తోంది. అంటే ఒక పార్టీ చేసిన వైఫల్యాలు, అవినీతిని చార్జిషీట్ల ద్వారా బయటపెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌పై, కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ చార్జిషీట్లు విడుదల చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్‌పై, తమిళనాడులో సీఎం స్టాలిన్‌పై బీజేపీ చార్జిషీట్లు విడుదల చేసింది. వీటిలో అనేక అవినీతి, వైఫల్యాల్ని పార్టీలు ప్రస్తావించాయి. ఇప్పుడీ చార్జిషీట్లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఏపీలో సీఎం జగన్ వైఫల్యాలపై చార్జిషీట్లు విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒకరికొకరు సహకరించుకున్న బీజేపీ-వైసీపీ మధ్య ఇప్పుడు చార్జిషీట్ల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.

CM Jagan
ఇవే జగన్ వైఫల్యాలు
జగన్ పాలన గురించి చెప్పుకొంటే అనేక వైఫల్యాలు కనిపిస్తాయి. మద్యం విక్రయాలు, ఇసుక దందా, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ఆర్డీఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం ప్రాజెక్టు, సెంటు భూమి పథకంలో అక్రమాలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విశాఖలో భూ కబ్జాలు, రిషికొండ తవ్వకాలు, జాబ్ క్యాలెండర్ వంటి అనేక అంశాలున్నాయి. వీటన్నింటిపై బీజేపీ వరుసగా చార్జిషీట్లు దాఖలు చేయబోతుంది. ఈ చార్జిషీట్ల ద్వారా వైసీపీపై నేరుగా యుద్ధం ప్రకటించబోతుంది బీజేపీ. ఈ చార్జిషీట్లు విడుదల చేసేందుకు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, సీనియర్ నేత పురందేశ్వరి, సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కూడిన కమిటీ ఏర్పాటైంది. అలాగే రాష్ట్రస్థాయి, జిల్లా, జోన్, మండల, గ్రామ స్థాయిల్లో కూడా కమిటీలు ఏర్పాటయ్యాయి. వచ్చే నెల 5 నుంచి 15 వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో చార్జిషీట్లు దాఖలు చేస్తూ, వైసీపీపై పోరాడేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ఎక్కడ తేడా కొట్టింది?
నిన్నటివరకు పాలు-నీళ్లలా కలిసిపోయిన బీజేపీ-వైసీపీకి మధ్య ఇప్పుడు నిజంగానే దూరం పెరిగిందా? లేక ఇదంతా ఒట్టి డ్రామానా? వైపీపీపై ఒక రేంజులో పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏడాది పాటు ఉద్యమాలు, వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వైసీపీపై పోరాటం చేస్తోంది. అయితే, ఇంతకాలం లేనిది ఇప్పుడు ఉన్నట్లుండి ఇంత మార్పెలా వచ్చింది అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. నిజంగానే వైసీపీతో ఇక పనిలేదు అని బీజేపీ నిర్ణయానికి వచ్చిందా? లేక ఇదంతా వైసీపీ-బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామానా? ఈ రెండు పార్టీలూ ఒక్కటే అన్న భావన ప్రజల్లో పోవాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ ఈ పని చేస్తుండొచ్చు. లేక రాష్ట్రంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం గుర్రుగా ఉందా?
టీడీపీ దగ్గరవుతోందా?
బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మోదీకి, బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. పైగా కొద్ది రోజుల క్రితం టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసే అంశంపై పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి వచ్చారు. అప్పట్నుంచి బీజేపీ-టీడీపీ కలిసే అవకాశాలు పెరిగాయన్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోంది. వైసీపీపై బీజేపీ పోరాటం చేయడం.. బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఒకవేళ ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తే కనుక వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు. ఇంతకాలం ఉన్న కేంద్రం మద్దతు పోతే జగన్‌కు కష్టకాలం మొదలైనట్లే. నిజంగా బీజేపీ చేస్తున్న ఈ పని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.