BJP: పార్టీకి దూరంగా కీలక నేతలు.. బీజేపీ పరిస్థితి ఏంటి..?

గతంలో బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిక ఒక వర్గం.. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా అలాగే వ్యతిరేకిస్తోంది. బండిని తొలగించిన తర్వాత కిషన్ రెడ్డితోనైనా కలిసి సాగాల్సింది. కానీ, ఇప్పటికీ పార్టీ మీద, తమ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు కొందరు నేతలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2023 | 02:10 PMLast Updated on: Oct 07, 2023 | 2:11 PM

Bjps Key Leaders Away From Party Meetings What Is The Situation Of The Party

BJP: తెలంగాణలో బీజేపీని మళ్లీ గాడిలో పెట్టాలని హైకమాండ్ భావిస్తోంది. నిజానికి ఇప్పటికీ బీజేపీ అధిష్టానానికి తెలంగాణ మీద ఆశలున్నట్లే కనిపిస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నద్దా వంటి నేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఏదో ఒక చోట.. ఏదో ఒక పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీకి ఆదరణ దక్కేలా కేంద్రం కూడా ప్రయత్నిస్తోంది. తెలంగాణ నిధులు, కేంద్ర సంస్థల్ని ప్రధాని మోదీ కేటాయిస్తున్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు కూడా త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజల్లో బీజేపీపై సానుకూలత పెరిగేలా చేస్తున్నారు. ఇటీవల పసుపు బోర్డు ప్రకటన, గిరిజన యూనివర్సిటీ వంటివి ప్రకటించడంత తెలంగాణ బీజేపీపై ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. దీన్ని అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే.. ఎటొచ్చీ, పార్టీని నడిపించే నేతలే కరువయ్యారు. కీలక నేతలు చాలా మంది ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిక ఒక వర్గం.. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా అలాగే వ్యతిరేకిస్తోంది. బండిని తొలగించిన తర్వాత కిషన్ రెడ్డితోనైనా కలిసి సాగాల్సింది. కానీ, ఇప్పటికీ పార్టీ మీద, తమ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు కొందరు నేతలు. ముఖ్యంగా సీనియర్ నేతలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరకు.. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు కూడా వీళ్లు గైర్హాజరయ్యారు. తాజాగా నిర్వహించిన పదాదికారుల సమావేశానికి కూడా హాజరుకాలేదు. వీళ్ల అలకను గుర్తించిన అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది.

ఏనుగు రవీంద్రనాథ్ రెడ్డి మినహా విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాజాగా ప్రకటించిన కమిటీలలో చోటిచ్చారు. ఈ కమిటీలపై ఆయా నేతలు ఇంకా స్పందించలేదు. పార్టీతో దూరం పాటిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వీళ్లు బండిని అధ్యక్ష పీఠం నుంచి తప్పించాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కానీ, ఇప్పుడు కూడా వీరికి ప్రాధాన్యం దక్కడం లేదు. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. బండి ఉన్నప్పుడే ఏదోలా వీరికి పార్టీలో గౌరవం దక్కిందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. వీరితోపాటు మరికొందరు కూడా అసంతృప్తి బాటలోనే ఉన్నారు. వీళ్లంతా త్వరలో పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ.. కీలక నేతలు పార్టీకి దూరంగా ఉండటం కచ్చితంగా బీజేపీకి ఇబ్బంది కలిగించేదే.