Bandi Sanjay: బండి సంజయ్ వ్యతిరేకులకు షాక్.. ఎన్నికల వరకూ అధ్యక్షుడు ఎవరో తేల్చేసిన చుగ్..!
దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో బండి సంజయ్‌కు క్రేజ్ పెరిగింది. ఈ పరిస్థితిని ఆయన వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆయనపై హైకమాండ్‌కి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ వచ్చింది. దీంతో అధ్యక్షుడిగా ఆయన పదవి ఊడుతుందంటూ అనేక కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి.

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు అంశం మరోసారి కాక రేపింది. బండి సంజయ్‌ని తీసేసి ఆ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమిస్తున్నారన్న ప్రచారం సెగలు రేపింది.
తెలంగాణలో బీజేపీ పేరు అక్కడో ఇక్కడో కాస్త గట్టిగా వినిపిస్తుందంటే అది బండి సంజయ్ పుణ్యమే. బీజేపీ సారథిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో చాలా మార్పులు జరిగాయి. గతంలో ఉన్న పార్టీ అధ్యక్షులకు భిన్నంగా బండి సంజయ్ దూకుడు ప్రదర్శించారు. దీంతో ఆయనకు పార్టీ జాతీయ నాయకత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది. తనపై మరింత బాధ్యత పెరగడంతో సంజయ్ ఇంకా యాక్టివ్ అయ్యారు. అందర్నీ కలుపుకొనిపోతూనే కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయనకు వ్యతిరేకవర్గం ఏర్పడింది. అటే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో బండి సంజయ్‌కు క్రేజ్ పెరిగింది. ఈ పరిస్థితిని ఆయన వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆయనపై హైకమాండ్‌కి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ వచ్చింది. దీంతో అధ్యక్షుడిగా ఆయన పదవి ఊడుతుందంటూ అనేక కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే వాటిలో నిజమెంత..?
తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన బండి సంజయ్‌కి సంబంధించిన వార్త తెగ వైరల్ అయ్యింది. బండి సంజయ్‌కి కేంద్ర క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తున్నారని.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని బండి నుంచి కిషన్‌రెడ్డికి బదిలీ చేస్తున్నారన్నది ఆ కథనం సారంశం. ఎక్స్‌క్లామెటరీ మార్క్‌తో కూడా ఆ వార్త ప్రసారం కావడంతో అంతా నిజమనే భావించారు. అయితే మరో ప్రముఖ ఛానెల్ ఈ విషయం గురించి క్రాస్ వెరిఫై చేసింది. తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్‌ని ఫోన్‌లో కాంటాక్ట్ చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. అసలు తెలంగాణలో పార్టీ నాయకత్వ మార్పు ఉండబోదని.. ఇప్పటికే ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పామని కుండబద్దలు కొట్టారు తరుణ్ చుగ్. జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని తేల్చేశారు. దీంతో బండి వ్యతిరేకులకు ఆనందానికి బ్రేకులు పడ్డాయి.
బండి సంజయ్‌ని తప్పిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుండగా హైకమాండ్ మాత్రం ఆయనపైనే నమ్మకం పెట్టుకున్నట్టు అర్థమవుతోంది. అటు ఈటలతో పాటు మిగిలిన సీనియర్లు మాత్రం బండి సంజయ్ విషయంలో హ్యాపీగా లేరు. ఆయన స్థానంలో వేరే ఎవరినైనా నియమించాలని పట్టుపడుతున్నారు. అందుకే ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి కర్ణాటక ఫలితాల ముందు వరకు బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రధాన పోటిదారుగా కనిపించినా ఆ తర్వాత కాంగ్రెస్ ఆ పొజిషన్‌లోకి రావడం, పొంగులేటి, జుపల్లి లాంటి నేతలు కూడా హస్తం గూటికే చేరుతుండడం బండి సంజయ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామాల్లోనే 125 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను ఇటివలే బండి సంజయ్ విడుదల చేశారు. ఈ జాబితాలో దాదాపు 70-80 మంది బండి సంజయ్ అనుకూల వర్గీయులుగా ప్రచారం చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకుల వెంట తిరుగుతున్న కొందరు గులాబీ పార్టీ నాయకులను కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బండి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. దీనిపై నిజానిజాలు ఎలా ఉన్నా హైకమాండ్ మాత్రం అధ్యక్షుడిగా బండి ఉంటేనే బెటర్ అని భావిస్తుంది. ఇది బండి వ్యతిరేకులకు మింగుడు పడని విషయం.