పాకిస్థాన్‌లో పుట్టి భారత్‌కు ప్రధానిగా

భారతదేశ రాజకీయ చరిత్రతో ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 12:29 PMLast Updated on: Dec 27, 2024 | 12:29 PM

Born In Pakistan Became The Prime Minister Of India

భారతదేశ రాజకీయ చరిత్రతో ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు.. నేటి తరం రాజకీయాల్లో ‘మిస్టర్‌ క్లీన్‌’.. రేపటి తరం రాజకీయ నేతలకు ఆదర్శం… విద్యా వేత్తగా, ఆర్థిక వేత్తగా, సంస్కరణల రూప శిల్పిగా.. నిగర్వి, నిష్కళ, నిరాడంబరుడుగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవన ప్రస్థానం ముగిసింది. 92 ఏళ్ల వయసులు వయో భారంతో మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన మన్మోహన్‌ సింగ్‌ నిజానికి పుట్టింది పాకిస్థాన్‌లో. కానీ ఆయన పాకిస్థాన్‌ పౌరుడా అంటే కాదు. 1932 సెప్టెంబర్ 26న పాకిస్థాన్‌లోని వెస్ట్‌ పంజాబ్‌ ప్రాంతంలో జన్మించారు మన్మోహన్‌ సింగ్‌. 1947లో దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. 1958 సెప్టెంబర్ 14న గురు శరణ్ కౌర్‌ను పెళ్లి చేసుకుని ఇండియాలోనే స్థిరపడ్డారు మన్మోహన్‌ సింగ్‌. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన జీవిత ప్రస్థానం ప్రధానిగా దేశానికే దారి చూపింది.

అట్టడుగు స్థాయికి వెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిలో పెట్టిన నేత మన్మోహన్‌ సింగ్‌. మీడియా నుంచే కాదు.. ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉన్నారంటూ ఆయన ఎంత క్లీన్‌ పొలిటీషియనో అర్థం చేసుకోవచ్చు. తన అర్ధ జీవితాన్ని భారత రాజకీయాలకు అంకితం చేసిన మన్మోహన్‌ సింగ్‌.. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా సార్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. డిసెంబర్‌ 26న ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ను హాస్పిటల్‌ చేర్పించారన్న విషయం తెలియగానే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌ హాస్పిటల్‌కు వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్‌ గాంధీ సైతం హాస్పిటల్‌కు వచ్చారు. మన్మోహన్‌ మృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. మన్మోహన్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి మన్మోహన్‌ సింగ్‌ గౌరవార్థం 7 రోజులు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించారు.