బోరుగడ్డ జీవితం జైలుకే…? పూర్తిగా వదిలేసిన వైసీపీ అధిష్టానం
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఒకరు. జగన్ పై అభిమానంతో ఎవరేమన్నా సరే మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బోరుగడ్డ అనిల్ ను మూడు నెలల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఒకరు. జగన్ పై అభిమానంతో ఎవరేమన్నా సరే మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బోరుగడ్డ అనిల్ ను మూడు నెలల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పై అభిమానం అని చెప్తూ జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడారు బోరుగడ్డ అనిల్.
ఇక ఆయనను అరెస్టు చేసిన తర్వాత వైసిపి నుంచి మద్దతు వస్తుందని, బోరుగడ్డ అనిల్ కోసం ఆ పార్టీ న్యాయ విభాగం స్పందిస్తుందని చాలామంది ఆశించారు. కానీ ఇప్పటివరకు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారో… ఆయనను ఏ జైల్లో పెట్టారో కూడా వైసీపీ నేతలు కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయనను పరామర్శించేందుకు స్థానిక వైసీపీ నేతలు కూడా వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. అటు పార్టీ కూడా ఇప్పటివరకు దీనిపై అధికారికంగా రియాక్ట్ కాలేదు.
వైసిపి సోషల్ మీడియా ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియోలను పెద్ద ఎత్తున వైరల్ చేసేది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కు మద్దతుగా ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. బోరుగడ్డ అనిల్ తర్వాత అరెస్టు అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా ఇలాగే వ్యవహరించింది. నందిగం సురేష్ అరెస్ట్ అయి బయటికి వచ్చిన తర్వాత జగన్ కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు అనే ప్రచారం జరిగింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లిన సందర్భంగా నందిగం సురేష్ ను జగన్ భద్రతా సిబ్బంది ఆయన కాన్వాయ్ వద్దకు రానీయలేదు.
దీనిపై టిడిపి అనుకూల మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. ఆయన జైల్లో ఒంటరిగానే పోరాటం చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు హైకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. కొన్నాళ్లపాటు బోరుగడ్డ అనిల్ జైల్లో ఉండటమే మంచిది అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉండటంతోనే బోరుగడ్డ అనిల్ బయటికి రావడం కష్టమవుతుందని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరులోని కొన్ని షాపులను యజమానులను బెదిరించి అతను వసూళ్లకు కూడా పాల్పడ్డాడని, అలాగే కొన్ని బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే విషయంలో కూడా అక్రమాలకు బోరుగడ్డ అనిల్ పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అలాగే కొంతమందిని బెదిరించిన విషయంలో కూడా ఆయనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మరి బోరుగడ్డ అనిల్ జైలు నుంచి బయటకు వస్తారా.. లేదంటే అక్కడే ఉండిపోతారా అనేది చూడాలి.