Top story; బాస్ బెంగళూరులో…. లీడర్లు హైదరాబాదులో అయోమయంలో వైసిపి క్యాడర్

ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వాలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని భారీ ఓటమితో వైసిపి కుదేలైపోయింది. జనం కొట్టిన దెబ్బకి ఆ పార్టీ షాక్ నుంచి ఇంకా కోలుకోలేక పోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 11:48 AMLast Updated on: Jan 25, 2025 | 11:48 AM

Boss In Bengaluru Leaders In Hyderabad Ycp Cadre In Confusion

ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వాలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని భారీ ఓటమితో వైసిపి కుదేలైపోయింది. జనం కొట్టిన దెబ్బకి ఆ పార్టీ షాక్ నుంచి ఇంకా కోలుకోలేక పోతోంది. ఏడు నెలలు దాటిపోయినా… వైసిపి ఇప్పటికీ స్టేచర్ పై నుంచి లేవలేకపోతోంది. దీనికి కారణం వైసిపి సర్వం జగన్మయం అయిపోవడమే.పార్టీ అధినేత బెంగళూరులో సెటిలైపోవడం తో లీడర్లు కాన్స్టెన్సీ వదిలేసి హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. క్యాడరు, చిన్న స్థాయి నాయకులు అసలేం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయారు.

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. అందరూ చంద్రబాబు పని అయిపోయింది అనుకున్నారు. ఒక వారం మాత్రమే మీడియాలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ స్తబ్దత కనిపించింది. సరిగ్గా వారం తర్వాత చంద్రబాబు జిల్లా రివ్యూ మీటింగ్ షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ప్రతిరోజు శ్రమిస్తూనే వచ్చారు.చేస్తున్న పని రైటో … రాంగో కానీ చేస్తూనే ఉన్నారు. ఐదేళ్లపాటు అధికార పార్టీని ఊపిరి తీసుకొనివ్వలేదు. తన వ్యవహార శైలిపై జనం నవ్వుకున్న… పార్టీ నేతలు విసుక్కున్న… మీడియాలో ఒక వర్గం సపోర్ట్ చేయకపోయినా…. అన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ తన వ్యూహాల్ని అమలు చేస్తూ వచ్చారు. జగన్ సర్కార్ ఒక తప్పు చేస్తే దాన్ని 100 తప్పుల్లాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. మరోవైపు సామాజిక వర్గాన్ని కూడగట్టారు. నిత్యం తిరుగుతూనే ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం వైసీపీ నేతల అవహేళనలను ఎదుర్కోవడం మానసికంగా దృఢంగా నిలబడడం చంద్రబాబుకు ఉన్న గొప్ప లక్షణం. చివరిలో పవన్ కళ్యాణ్ ని కలుపుకోవడం, 2014లో ఏ మోడీ నైతే బండ బూతులు తిట్టారో అదే మోడీతో చేయి కలపడం ద్వారా… చరిత్రలో కనివిని ఎరుగని విజయాన్ని అందుకున్నారు చంద్రబాబు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా. చంద్రబాబు ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయనకు రాజకీయాలు తప్ప మరి ఇంకేమీ పట్టవు. జగన్ ఒక వ్యాపారవేత్త. ప్రతి నిమిషం ఆయనకు వ్యాపారమే. ఇప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఓడిపోయిన వారం తర్వాత చంద్రబాబు తిరిగి రాజకీయ క్షేత్రంలో యుద్ధం మొదలుపెడితే… ఓడిపోయి ఏడు నెలలైనా అసలు తనకొక పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోయి సొంత పనుల్లో బిజీ అయిపోయాడు జగన్. ఏదో అడపాదడపా తిరుపతి తొక్కిసలాట లాంటి సంఘటన జరిగితేనే ప్రత్యక్షమవుతాడు జగన్.

ఓడిపోగానే జగన్ చేసిన అతిపెద్ద తప్పిదం… బెంగళూరుకి షిఫ్ట్ అయిపోవడం. నాయకుడు యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోతే సైన్యం మానసికంగా బేజారేత్తిపోతుంది. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది. రకరకాల కారణాలతో నాయకులు మొత్తం హైదరాబాద్ కి జంప్ అయిపోయారు. అధినేత కర్ణాటక పారిపోతే. పార్టీ నాయకులంతా తెలంగాణకి పరుగులు పెట్టారు. దాదాపు వైసీపీ నేతలు అందరికీహైదరాబాదులో సొంతిల్లు సొంత వ్యాపారాలు ఉండనే ఉన్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఏకంగా అమెరికా పారిపోయి… మళ్లీ తిరిగి వచ్చి హైదరాబాదులో ప్రశాంతంగా సొంత పనులు చేసుకుంటున్నాడు. అదేంటంటే నేను బుద్ధిగా చదువుకుంటున్నాను అని చెప్తున్నాడు. అరవీర భయంకర గుడివాడ నాని ట్రీట్మెంట్ పేరుతో పూర్తిగా హైదరాబాదులోనే సెటిల్ అయ్యాడు. ఇక వైసిపి నాలుగు పిల్లర్స్ లో ఒకరైన సుబ్బారెడ్డి జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో ఈ ఐదేళ్ల శేష జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఒకప్పుడు వీకెండ్ హైదరాబాద్ వచ్చేవాడు. ఇప్పుడు వీక్ అంతా హైదరాబాదులోనే ఉంటున్నాడు. వైసీపీ బ్రాండెడ్ చెల్లెమ్మ విడదల రజిని నెల కు 25 రోజులు హైదరాబాదులోనే గడుపు తున్నారు. త్వరలో మంచి సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారు.

ఇక ఆ పార్టీ సకల శాఖల నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాదులో తన సొంత ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ, తన వ్యాపారాలను, మైన్స్ ఇతర వ్యవహారాలను సమీక్షించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై చాలా రేగిపోయే పేర్ని నాని హైదరాబాదులోని ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఎక్కువకాలం గడుపుతున్నారు. తన గోడౌన్స్కు సంబంధించి కేసు వ్యవహారాలు చూసుకోవడానికి మాత్రమే బందర్ కి వెళ్తున్నారు. నెల్లూరు అనిల్ యాదవ్ చెన్నై బెంగళూరులో పెట్టుబడులు పెట్టారు. ఆ వ్యవహారాలు బిజీగా ఉన్నారాయన. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ బెంగళూరుకు పరిమితమైతే…. వైసిపి నాయకులు అంతా హైదరాబాదులో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నియోజక వర్గాల నుంచి ఎవరైనా ఫోన్లు చేసి… సార్ ఎప్పుడు వస్తారు అని అడిగితే…? ఇప్పుడు రావడం అవసరమా? డబ్బులు బొక్క. వస్తే రోజుకు రెండు లక్షలు వదిలించుకోవాలి. క్యాడర్ రక్తం తాగినట్టు డబ్బులు పిండేస్తున్నారు. చూద్దాంలే. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వస్తాం అని చెప్పి తప్పించుకుంటున్నారు.

కృష్ణాజిల్లా పార్టీ వ్యవహారాల రివ్యూ కమిటీ… హైదరాబాదులోని వైవి సుబ్బారెడ్డి ఇంట్లో నిర్వహించి… ఇక్కడే జిల్లా నాయకులంతా హాజరయ్యారంటే వైసిపినీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో అర్థం అవుతుంది. ఎవరైనా గట్టిగా అడిగితే ఒక వన్ ఇయర్ అయినా టిడిపి, జనసేన వాళ్లని పని చేయనివ్వాలిగా… వాళ్ళ నాలుగు తప్పులు చేస్తే మనం వాళ్లని నిలదీయడానికి ఛాన్స్ ఉంటది. అప్పటివరకు ఎందుకు లేనిపోని దురద అంటించుకోవడం అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్లు. జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతుంటే…. వాళ్లు లబోదిబోమని ఫోన్లు చేసిన…. కొందరు నాయకులు హైదరాబాదులో ఉండి ఫోన్ ఎత్తడం లేదట. జగన్ లండన్ లాంగ్ టూర్ వేయడంతో నాయకులంతా ఇంకా ఫ్రీ అయిపోయారు. వైసీపీలో ఓ పదిమంది టాప్ లీడర్స్ మాత్రం టిడిపి హై కమాండ్ తో చర్చలు జరుపుతూ… తమ వ్యాపారాలకు అడ్డు రావద్దంటూ రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపునీ నిరసిస్తూ రాష్ట్రం మొత్తం ఆందోళన చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.

ఎక్కడికక్కడ ఏదో తూతూ మంత్రంగా ఒక అరగంట నినాదాలు ఇచ్చి లీడర్లంతా సర్దుకున్నారు. ఇదేందన్నా ఇలా చేశారు అని అడిగితే…. మా నాయకుడు బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయనకే సీరియస్ నెస్ లేకపోతే… మాకు ఎక్కడి నుంచి వస్తుంది.? ఆయన వచ్చి మాతో పాటు ధర్నాలో కూర్చుంటానంటే మేం కూడా రోడ్లెక్కి వాళ్ళం. కంపెనీ సీఈఓ లాగా ఆర్డర్ వేసి వెళ్ళిపోతే ఎలా? అని కొందరు పెద్ద నాయకులు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. దారుణ ఓటమి తర్వాత కూడా జగన్ లో మార్పు రాలేదని…. పోలింగ్ కి మూడు రోజులు ముందు డబ్బులు పంచితే సరిపోతుందిలే, ఆటోమెటిగ్గా మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే ధీమా ఆయనలో కనిపిస్తోందని మరికొందరు నాయకులు చెవులు కోరుకుంటున్నారు. జగన్ రాజకీయం కేవలం అధికార పార్టీ తప్పిదాలపైనే నడుస్తుంది. ఏపీలో కూటమి సర్కార్ తప్పులు చేయబోతుందా…. ఆ తప్పులు పట్టుకొని మనం జనంలోకి వెళ్తే తిరిగి మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం నా ధీమా జగన్ లో కనిపిస్తుంది తప్ప… పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం… చేసిన తప్పుల్ని సమీక్షించుకోవడం అనే ప్రక్రియ వైసీపీలో ఏ కార్నర్ల లోను కనిపించడం లేదు.40% ఓటింగ్ ఉంది కనుక ఓ 10% పెంచుకుంటే సరిపోతుందిలే. ఈ నాలుగేళ్లలో కూటమి సర్కార్ చేసే తప్పు లే మనల్ని గెలిపిస్తాయి. ఎన్నికల్లో డబ్బులు పంచితే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. అందుకే ఎన్నికల వరకు వ్యాపారాలు చేసుకుందాం అని బాస్ బెంగళూరులో… లీడర్లు హైదరాబాదులో సెటిల్ అయిపోయారు.