తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్... హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసారు. ఏసీబీ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. నేడు ఉదయం.. కేటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్ట్ కొట్టేసింది. దీనితో ఏసీబీ, ఈడీ అధికారులు కేటిఆర్ కు నోటీసులు పంపారు. ఇక విహారణ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. HMDA పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని.. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని అభిప్రాయపడింది. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారన్న కోర్ట్ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని స్పష్టం చేసింది. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని సూచించింది. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని తేల్చి చెప్పింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో మేం ఇప్పడే జోక్యం చేసుకోం. ఈ-రేస్ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని వెల్లడించింది.