Breaking News: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను అమరావతి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2023 | 07:11 AMLast Updated on: Sep 09, 2023 | 7:19 AM

Breaking News Tdp Chief Chandrababu Naidu Arrested In Skill Development Case At Nandyal

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో పర్యటిస్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే తెల్లవారుజామున హైడ్రామా అనంతరం చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. చంద్రబాబు హయంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగిందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. షెల్ కంపెనీ ద్వారా రూ. 241 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ, ఈడీ ఇప్పటికే విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాక డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.

అరెస్టుకు ముందు నంద్యాలలో హైడ్రామ్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి నుంచే చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన బస్ చుట్టూ నిద్రిస్తున్న వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చంద్రబాబు బస చేస్తున్న బస్ డోర్ కొట్టి లోపలికి వెళ్లారు. తనను ఏ కేసులో అరెస్టు చేసేందుకు వచ్చారో ప్రాథమిక ఆధారాలు చూపాలని విచారణాధికారిని చంద్రబాబు ప్రశ్నించారు. 51 నోటీసులు ఇస్తే రిమాండ్ రిపోర్టు ఎలా అడుగుతారని పోలీసులు ప్రశ్నించారు. అరెస్టుకు సహకరించాలని చంద్రబాబును పోలీసులు కోరారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నామని రాసివ్వాలని చంద్రబాబు కోరారు. ప్రాథమిక ఆధారాలు ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తామని రాసివ్వాలని టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేశారు.

మరోవైపు.. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సూచించారు. FIRలో చంద్రబాబు పేరు లేదు కదా అని ప్రశ్నించారు. FIRలో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలు తమ వద్ద ఉన్నాయని డీఐజీ వెల్లడించారు. ఒకవేళ తాము ఆధారాలు ప్రవేశపెట్టకపోతే కోర్టే తిరస్కరిస్తుంది కదా అన్నారు. కోర్టు తిరస్కరించడం అనేది ట్రెండే కదా అని డీఐజీ నోరు జారారు. అనంతరం న్యాయవాదులపైన, న్యాయస్థానాల పైన తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. కొన్ని వేల పేపర్లు తమ వద్ద ఉన్నాయని.. పీఎస్ కు వెళ్లగానే ఇస్తామని డీఐజీ చెప్పారు. అనంతరం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అమరావతి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.