Party Tickets: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో టిక్కెట్ల పంచాయితీ.. భారీగా ఆశావహులు.. సర్దుబాట్లు చేయలేకపోతున్న పార్టీలు.. ఎదురుదెబ్బ తప్పదా?

తెలంగాణలో ఎన్నికలకు ఐదు నెలల సమయం కూడా లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈలోపు తమ టిక్కెట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. బీజేపీలో టిక్కెట్లకు అంత డిమాండ్ లేదు కానీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో మాత్రం భారీ డిమాండ్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2023 | 04:35 PMLast Updated on: Jul 10, 2023 | 4:35 PM

Brs And Congress In High Demand Among Ticket Seekers

Party Tickets: ఈసారి తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి తయారైన సంగతి తెలిసిందే. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. అందుకే ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. నేతలకు టిక్కెట్లు ఇవ్వలేక పార్టీ పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయితీ ఎన్నికల్లో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎన్నికలకు ఐదు నెలల సమయం కూడా లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈలోపు తమ టిక్కెట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. బీజేపీలో టిక్కెట్లకు అంత డిమాండ్ లేదు కానీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో మాత్రం భారీ డిమాండ్ ఉంది. నియోజకవర్గానికి ఒకరికంటే ఎక్కువ మందే సీట్ల కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఏం చేయాలో, ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక అధిష్టానం ఇబ్బంది పడుతోంది.

అధికార పార్టీలో ఇబ్బంది

బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలో సహజంగానే డిమాండ్ ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో సిట్టింగులకే ఛాన్స్ ఉండగా, కొన్ని చోట్ల కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆ స్థానాల్లో చాలా మంది టిక్కెట్లు ఆశిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో అధికార పార్టీనేతల మధ్య తగాదాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వంటి నేతల మధ్య గొడవకు కారణం ఎమ్మెల్యే టిక్కెటే అని తెలిసిందే. ఇలాగే చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మధ్య టిక్కెట్ల వార్ కొనసాగుతోంది. అనేక నియోజకవర్గాల్లో టిక్కెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఈ విషయంలో కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టిక్కెట్లు ఇచ్చే వారిపై ఎంత సానుకూలత ఉన్నా.. టిక్కెట్లు రానివాళ్లు రెబల్స్‌గా పోటీ చేసినా, ఇతర పార్టీల్లో చేరినా బీఆర్ఎస్ ఓట్లకు గండి పడటం గ్యారెంటీ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని ఉన్నా.. దీనివల్ల ఇతర నేతలు తిరగబడితే సమస్య తప్పదనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. కొన్ని చోట్ల టిక్కెట్ల విషయం ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారు.
కాంగ్రెస్‌లోనూ అదే పంచాయితీ
బీఆర్ఎస్ తర్వాత అధిక డిమాండ్ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇటీవల కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపిస్తుండటంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కని నేతలంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఒక్కరికంటే ఎక్కువ మందే టిక్కెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తమకే దక్కుతుందనే నమ్మకంతో చాలా మంది ఆశావహులు నియోజకవర్గాల్లో పని చేస్తున్నారు. వాళ్లందరికీ సీట్లు కేటాయించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఒకరికి సీటు ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పోటీగా ఇతర పార్టీల నుంచి పోటీ చేయొచ్చు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టమే. అందుకే కాంగ్రెస్ కూడా టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంలో అంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ.. ఎన్నికల సమయానికి రెండు పార్టీల్లోనూ టిక్కెట్లు దక్కని నేతలు రెబల్స్‌గా మారే అవకాశం ఉంది. కొందరు తాము పోటీ చేయకపోయినా.. తమకు టిక్కెట్ ఇవ్వని పార్టీని మాత్రం ఓడించే అవకాశాలున్నాయి.