BRS: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎవరు..? ఇంకెప్పుడు తేలుస్తారు..?

ప్రస్తుతం మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, భాను ప్రసాద్ రావు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీ మొదటి శాసన సభాపతిగా పని చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 06:54 PMLast Updated on: Mar 05, 2024 | 6:54 PM

Brs Assembly Floor Leader Will Be Selected Soon

BRS: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలవుతోంది. రెండు విడతల అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. ప్రభుత్వం చీఫ్ విప్, విప్‌లను ప్రకటించింది. ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించాయి. శాసన మండలిలో కూడా రెండు పార్టీలు ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించినా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మాత్రం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పదవి కోసం ప్రస్తుతం పార్టీలో పోటీ గట్టిగానే ఉందని, అందుకే ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది.

PM MODI: తెలంగాణలో 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ..

తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌కు 28 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఇద్దరు.. పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పార్టీ మారిపోయారు. కౌన్సిల్‌లో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సూపర్‌ సీనియర్స్‌ ఉన్నా.. ఫ్లోర్ లీడర్ పదవి తీసుకునేందుకు వారు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మిగతా వారిలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్సీలు పదవి కోసం పోటీ పడుతున్నారట. ప్రస్తుతం మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, భాను ప్రసాద్ రావు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీ మొదటి శాసన సభాపతిగా పని చేశారు. సత్యవతి రాథోడ్ స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పని చేశారు. భాను ప్రసాద్, ప్రభాకర్ రావు విప్‌లుగా పని చేశారు. అందరికీ అనుభవం ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షం కౌన్సిల్‌లో ప్రభుత్వానికి ధీటుగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ఫ్లోర్ లీడర్ పదవిని ఎవరికి ఇస్తారో అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ముందు ఉన్నారు.

వీరిలో సత్యవతికే పదవి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ కూడా సత్యవతి రాథోడ్ వైపే మొగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సత్యవతికి ఇస్తే.. కౌన్సిల్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా ఉంటుందన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలిసింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మహిళా కూడా కావడంతో పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలు వెళ్తాయని అనుకుంటున్నారట. దీంతో మధుసూదనాచారి గట్టిగా ప్రయత్నిస్తున్నా.. మొగ్గు సత్యవతికే ఉంటుందని అంటున్నారు. అధికారిక ప్రకటన రావడమే మిగిలిందని అంటున్నాయి పార్టీ వర్గాలు.