BRS-BJP Tie up : కాషాయానికి పింక్ భయం… BRSతో పొత్తు వద్దురా భయ్ !

పింక్‌ పేరెత్తితేనే కాషాయదళంలో కంగారు పెరిగిపోతోందట. లిటరల్‌గా చెప్పాలంటే బాబోయ్‌... అని దండం పెట్టేస్తున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. గట్టిగా చెప్పుకోవాలంటే... వాళ్ళ ప్రస్తావన వస్తేనే... మాకు అరెకరం తడిసిపోతోందని ఆఫ్‌ద రికార్డ్‌లో అంటున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేనన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో తమను చాలా డ్యామేజ్‌ చేసిందని కమలనాధులు క్లారిటీకి వచ్చేసినట్టు తెలిసింది. ఆ గులాబీ ముళ్ళు మరోసారి కమలానికి గుచ్చుకుంటే... తాము కకావికలం అవడం ఖాయమని భయపడుతున్నారట కాషాయ నేతలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 10:20 AMLast Updated on: Feb 22, 2024 | 10:20 AM

Brs Bjp Tie Up

పింక్‌ పేరెత్తితేనే కాషాయదళంలో కంగారు పెరిగిపోతోందట. లిటరల్‌గా చెప్పాలంటే బాబోయ్‌… అని దండం పెట్టేస్తున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. గట్టిగా చెప్పుకోవాలంటే… వాళ్ళ ప్రస్తావన వస్తేనే… మాకు అరెకరం తడిసిపోతోందని ఆఫ్‌ద రికార్డ్‌లో అంటున్నారట తెలంగాణ బీజేపీ నేతలు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేనన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో తమను చాలా డ్యామేజ్‌ చేసిందని కమలనాధులు క్లారిటీకి వచ్చేసినట్టు తెలిసింది. ఆ గులాబీ ముళ్ళు మరోసారి కమలానికి గుచ్చుకుంటే… తాము కకావికలం అవడం ఖాయమని భయపడుతున్నారట కాషాయ నేతలు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్‌కు పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఇంతకు మించి ఇంకా ఎక్కువైనా, తాము ఇప్పుడే జాగ్రత్త తీసుకోకుండా వదిలేసినా… ఖచ్చితంగా మరోసారి డ్యామేజ్‌ జరుగుతుందన్న చర్చ బీజేపీ నేతల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలాంటి ప్రచారంతోనే చివరికి పార్టీ కేడర్ కూడా సందిగ్ధంలో పడింది. అలాంటిదేమీ లేదని పైస్థాయిలో చెప్పినా… గ్రౌండ్‌ లెవల్‌ కేడర్‌ నమ్మలేని పరిస్థితి ఉంది నాడు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేకపోయామని బీజేపీ పోస్ట్‌మార్టంలో తేలిందట. ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రచారం షురూ అవడంతో… కమలం నేతల్లో గుబులు మొదలైనట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌తో పొత్తు మాటెత్తితేనే వణికిపోతున్నారట ఆ పార్టీ నేతలు. చివరికి పార్టీ కేడర్‌లోనూ ఇంకా పొత్తు అనుమానం పోలేదట. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులే మళ్ళీ కనిపిస్తున్నాయని, అప్పుడు కూడా తమ కేడర్‌ సైతం ప్రచారాన్ని గట్టిగా నమ్మి నారాజ్‌ అయిందని, మళ్ళీ డ్యామేజ్‌ జరక్కుండా జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని గట్టిగా చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు.

కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, దాన్ని నమ్మవద్దని ప్రతి మీటింగ్‌లోనూ చెబుతున్నారు. బాధ్యత గల స్థానంలో ఉండి చెబుతున్నాం…. వినండి… బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ ముఖ్యనేతలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారంటేనే… ఆ ప్రచారానికి వాళ్ళు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతోందంటున్నారు పరిశీలకులు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తు అని ఎవరైనా అంటే… కొట్టండంటూ…పిలుపునివ్వడం వెనక కేడర్‌లో విశ్వాసం నింపే ప్రయత్నం ఉందన్నది ఓ పరిశీలన. అసలు ఆ పార్టీ అవసరమే తెలంగాణకు లేదని, అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకొంటామంటూ కౌంటర్స్‌ ఇస్తున్నారు బీజేపీ నేతలు. పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రల్లో పాల్గొంటున్న నేతలు కూడా బీఆర్‌ఎస్ తో పొత్తు ఉండదని పదేపదే చెబుతున్నారు. మొత్తం 17 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని నొక్కి చెబుతున్నారు. అదే సమయంలో కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అన్నా కూడా గుబులుపడుతున్నారట బీజేపీ నేతలు. ఆయన ఎందుకు వెళ్తున్నారు? ఏ అజెండాతో వెళ్తున్నారని ఆరా తీస్తున్నాయి బీజేపీ వర్గాలు. దీన్నిబట్టే బీఆర్‌ఎస్‌తో పొత్తు అంటే బీజేపీ నేతలు ఎంత కంగారు పడుతున్నారో అర్ధం అవుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ప్రచారానికి ఫుల్‌ ఎలా పెట్టాలంటూ మల్లగుల్లాలు పడుతున్నారట టి బీజేపీ నేతలు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.