BRS: బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రెడీ…!?
కేసీఆర్ దెబ్బకు సిట్టింగుల్లో చాలామందికి నిద్ర రావడం లేదు. ఎప్పుడు ఫోన్ వస్తుందో.... వస్తే ఏం చెబుతారోనని టెన్షన్ పడుతున్నారు. సీటు దక్కుతుందని క్లారిటీ వచ్చేసిన వారు ఊపిరి పీల్చుకుంటుంటే రానివారికి మాత్రం బీపీ ఓ రేంజ్‌లో పెరుగుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫస్ట్‌లిస్ట్‌ను రెడీ చేశారా…? త్వరలోనే మొదటి జాబితాను ప్రకటించబోతున్నారా…? మరి ఆ జాబితాలో ఉండేదెవరు…? సిట్టింగుల్లో ఊడేదెవరు…? ఫస్ట్‌లిస్ట్‌లో ఎన్ని పేర్లుండబోతున్నాయి…?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం సీఎం కేసీఆర్ ముందస్తు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో అభ్యర్థులను ముందుగానే ఫైనలైజ్ చేసి సమరంలోకి దూకాలని భావిస్తున్నారు. కూడికలు, తీసివేతలు పూర్తిచేసి ఫస్ట్‌లిస్ట్‌ను రెడీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం 66మంది అభ్యర్థులను ఫైనలైజ్ చేశారని బీఆర్ఎస్ అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతం అధిక శ్రావణమాసం నడుస్తోంది. ఆగస్టు16వ తేదీ వరకు ఇది ఉంటుంది. ఆగస్టు 17నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అప్పుడే కేసీఆర్ తొలిజాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత రెండో జాబితా ఉంటుంది. సెప్టెంబర్ చివరిలోగా రెండో జాబితాను కూడా ఫైనలైజ్ చేస్తారని చెబుతున్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్‌వర్క్ ఇంకా జరుగుతోందట.
తొలివిడతగా అభ్యర్థుల్ని ప్రకటించే 66 నియోజకవర్గాలు సిట్టింగ్ నియోజకవర్గాలే. ఇందులో దాదాపు 25చోట్ల సిట్టింగ్‌లను పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం. అంటే ఆ 25మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సీటు దక్కదన్నమాట. సర్వేల ఆధారంగా కేసీఆర్ ఈ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలివిడత జాబితా ప్రకటనతో ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్లే వ్యూహానికి పదును పెడుతున్నారు బీఆర్ఎస్ అధినేత. వివాదం, పోటీలేని స్థానాల్లో సర్వే ఆధారంగా తొలి జాబిత సిద్దం చేసినట్టు సమాచారం.
సీట్లు దక్కని ఎమ్మెల్యేలకు ఇప్పటికే అధిష్ఠానం నుంచి సంకేతాలు అందుతున్నాయి. రేసుకు పనికిరారని డిసైడైన సిట్టింగ్‌లకు మేటర్ చేరవేస్తోందట పార్టీ అధినాయకత్వం. తప్పించదల్చుకున్న కొందరు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా మేటర్ కన్వే చేస్తున్నట్లు తెలిసింది. మరికొందరిని కేసీఆర్ నేరుగా కలవడానికి కూడా ఇష్టపడటం లేదని చెబుతున్నారు. వారి సిఫార్సులను పక్కన పెట్టేయడం వంటి సంకేతాలతో ఇక సర్ధుకోవచ్చని చెప్పకనే చెబుతున్నారట గులాబీబాస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇలాగే స్పష్టత వచ్చేసిందట. కరీంనగర్‌లోనూ అదే పరిస్థితి ఉందట. సిట్టింగ్‌లకు సీటు ఇవ్వని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధం చేసేశారట కేసీఆర్. గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినట్లు టీఆర్ఎస్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రకంగా సంకేతాలు పంపుతుండటంతో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మీకు ఫోన్ వచ్చిందా అంటూ ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారట. పోటీ నుంచి తప్పించదలుచుకున్న ఒకరిద్దరు సీనియర్లను మాత్రం కేసీఆర్ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ దెబ్బకు సిట్టింగుల్లో చాలామందికి నిద్ర రావడం లేదు. ఎప్పుడు ఫోన్ వస్తుందో…. వస్తే ఏం చెబుతారోనని టెన్షన్ పడుతున్నారు. సీటు దక్కుతుందని క్లారిటీ వచ్చేసిన వారు ఊపిరి పీల్చుకుంటుంటే రానివారికి మాత్రం బీపీ ఓ రేంజ్‌లో పెరుగుతోంది.