BRS: ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ ఫోకస్.. రూరల్ ఓటర్లను ఆకర్షించే కొత్త అస్త్రం..!
తెలంగాణలో దాదాపు 75 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఉన్నట్లు అంచనా. వీరందరిని మచ్చిక చేసుకుంటే లక్షల్లో ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ గెలుపును ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ కన్ను వీరిపై పడింది.
BRS: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గ్రామీణ ఓట్లపై ప్రత్యేకదృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గ్రామాల్లో వైద్యరంగంలో కీలకంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలపై గురి పెట్టింది. వారిని ఆకట్టుకుంటే భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు, ఆర్ఎంపీలు అందిస్తున్న వైద్య సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేని చోట, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తుంటారు. ఊళ్లోని వాళ్లు అందరితోనూ వీరికి మంచి అనుబంధం ఉంటుంది. పైగా కొంతమందికి వీరి మాటే వేదం. గ్రామాల్లో అంత పట్టున్న ఆర్ఎంపీ, పీఎంపీల ద్వారా స్థానికుల ఓట్లు రాబట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకు ఒక పథకాన్ని రెడీ చేస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి, ఊళ్లలో వైద్యం చేసుకునేలా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా వారికి అనుమతి ఇస్తూ.. వారి ద్వారా గ్రామీణ ఓటర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు బీఆర్ఎస్ కోసం పని చేయాలి. తమ దగ్గరకు వచ్చే పేషెంట్ల కుటుంబాలను వీరు ప్రభావితం చేసి, వారి ఓట్లు బీఆర్ఎస్‌కు పడేలా చూడటమే వీరి బాధ్యత. ఈ రకంగా వైద్యులపై ఒత్తిడి తీసుకువస్తోంది. పరస్పర ప్రయోజనం కింద.. వైద్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇస్తే.. ఆ వైద్యులు ప్రభుత్వానికి ఓట్లు వేయించాలి. ఈ విషయంపై ఆయా సంఘాల నేతలతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపింది. దీనికి వాళ్లు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం ఒక అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనికి సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది.
ప్రైవేటు వైద్యులకు శిక్షణ ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, దాన్ని నెరవేర్చలేదు. ఈసారి దీన్ని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి, వైద్యులుగా సర్టిఫికెట్లు ఇవ్వనుంది. దీనిద్వారా ఇక వీళ్లు గ్రామాల్లో ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ఎంబీబీఎస్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది అన్ క్వాలిఫైడ్ కేటగిరి అని, దీన్ని రద్దు చేయాలని డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా, ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థను రద్దు చేయాలని ఎంబీబీఎస్ డాక్టర్లు డిమాండ్ చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ఆర్ఎంపీ సంఘాలు అంటున్నాయి. సరైన రోడ్లు వసతులు లేని గ్రామాల్లో కూడా తాము సేవలందిస్తున్నామని ఆర్ఎంపీ వైద్యులు అంటున్నారు. తెలంగాణలో దాదాపు 75 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఉన్నట్లు అంచనా. వీరందరిని మచ్చిక చేసుకుంటే లక్షల్లో ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ గెలుపును ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ కన్ను వీరిపై పడింది.