Aasara Pension: తెలంగాణలో దివ్యాగుల పింఛన్ పెంపు.. ఆసరా పింఛను రూ.4016.. జులై నుంచే అమలు
ఇప్పటిదాకా ప్రతి నెలా రూ.3,016 అందిస్తుండగా, జూలై నుంచి రూ.4,016 అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఇప్పటికే జీవో జారీ చేసింది. గత నెలలో సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన సభలో దీనిపై ప్రకటన చేశారు.
Aasara Pension: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలా అందిస్తున్న ఆసరా పింఛను వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ప్రతి నెలా రూ.3,016 అందిస్తుండగా, జులై నుంచి రూ.4,016 అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఇప్పటికే జీవో జారీ చేసింది. గత నెలలో సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన సభలో దీనిపై ప్రకటన చేశారు.
దీనికి అనుగుణంగా ఈ నెల నుంచి పెరిగిన పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 5,11,656 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. ప్రతి నెల ఈ పింఛన్ కోసం ప్రభుత్వం రూ.205.48 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఏపీలో 3.5 లక్షల మందికే పింఛన్ వచ్చేది. అది కూడా నెలకు రూ.500 మాత్రమే అందేది. అప్పట్లో నెలకు రూ.17 కోట్లు మాత్రమే కేటాయించేది ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ఫింఛన్‌ను కేసీఆర్ పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పథకం కింద దివ్యాంగులకే కాకుండా వితంతువులకు, వృధ్ధులకు, హెచ్.ఐ.వి. ఎయిడ్స్ ఉన్నరోగులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడి కార్మికులకు, బోదకాలు ఉన్నవాళ్లకు, కళాకారులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. దేశంలో బీడి కార్మికులకు పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
దివ్యాంగులు మినహా మిగతా అందరికీ రూ.2,016 రూపాయల పింఛన్ అందుతోంది. వృద్ధాప్య పింఛన్ పొందాలంటే 2019 ఏప్రిల్ 1 తర్వాత నమోదు చేసుకోవాలంటే 57 ఏళ్లు, అంతకంటే ముందు అయితే 65 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. చేనేత కార్మికులు, గీత కార్మికులు పింఛన్ పొందాలంటే 50 ఏళ్లు నిండి ఉండాలి. వితంతువులైతే, 18 ఏళ్లు పైబడి, భర్త మరణిస్తే అర్హులు. భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు వయసుతో పని లేదు. కనీసం 40 శాతం వైకల్యం ఉంటే చాలు. వినికిడి లోపమైతే 51 శాతం వైకల్యం ఉండాలి. హెచ్ఐవీ రోగులు సంబంధిత వైద్య పత్రాలు సమర్పించాలి.