CM KCR: ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్.. ఆగష్టులోగా ప్రభుత్వ పథకాల అమలు.. ఆపై ఎన్నికల సమరభేరి?
సంక్షేమ పథకాలు ప్రజలకు అందితేనే వాళ్లు ఓట్లు వేస్తారు. అయితే, కొంతకాలంగా సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదు. చాలా మంది కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు పింఛన్లు, రేషన్ కార్డులు అందించనుంది.

CM KCR: బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇంకో ఐదు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో చకచకా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని ఆగష్టులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడటం చాలా ముఖ్యం. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో గెలవలేం. అందుకే ప్రజలకు పథకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర కార్యక్రమాల్ని కూడా త్వరలోనే పూర్తి చేయబోతుంది.
సంక్షేమ పథకాలు ప్రజలకు అందితేనే వాళ్లు ఓట్లు వేస్తారు. అయితే, కొంతకాలంగా సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదు. చాలా మంది కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు పింఛన్లు, రేషన్ కార్డులు అందించనుంది. అలాగే కల్యాణ లక్ష్మీ సహా ఇతర పథకాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేసి వాటిని అందిస్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు వంటి పథకాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇలాంటి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులకు ఆగష్టులోగా అన్నీ అందించాలని ప్రభుత్వం ప్రణాళికగా నిర్ణయించుకుంది. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా ఈలోపే చేపట్టాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలును త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు, నేతలు పని చేస్తున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనిది గిరిజనుల భూములకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ఎక్కడికక్కడ ప్రజల నుంచి వచ్చే వినతుల్ని కూడా పరిష్కరించే పనిలో ప్రభుత్వం ఉంది. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వంపై అనేక విమర్శలున్నాయి. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం, కావాల్సిన వారికే పథకాలు అమలు చేయడం వంటివి చేస్తున్నారని నేతలపై విమర్శలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే లబ్ధిదారులను ఎంపిక చేసి, పథకాలు అందించే విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించనుంది. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలు శ్రీకారం చుడుతున్నారు. వివిధ అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తున్నారు.
ఎన్నికల కోసమే టైం
ఆగష్టు వరకు నేతలు ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై దృష్టిపెట్టాలి. ఆ తర్వాత.. అంటే సెప్టెంబర్ నుంచి పూర్తిగా రాజకీయాలకే టైం కేటాయించాలని సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు సాగుతున్నాయి. నేతలు కూడా అదే దారిలో ఉన్నారు. ఈ రెండు నెలలు పూర్తిగా ప్రజల కోసం టైం కేటాయిస్తున్నారు. ఆ తర్వాత నుంచి ఇక ఎన్నికలపై దృష్టి పెడతారు. నేతల బుజ్జగింపులు, కొత్త నేతల్ని చేర్చుకోవడాలు, రాజకీయ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఉండేలా చూస్తారు. ప్రత్యర్థులపై విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులు, పదవుల ఆశ చూపడం వంటి కార్యక్రమాలతో మూడు నెలలపాటు పూర్తిగా నేతలు ఎన్నికలపైనే ఫోకస్ చేస్తారు. అటు ఎన్నికలు, ఇటు ప్రజా పథకాల అమలు విషయలో కచ్చితమైన ప్రణాళికతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. మరి ఈ ప్రణాళిక ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.