CM KCR: ప్రతిపక్ష కూటమి.. ఎన్డీయే.. ఎటూ చేరని కేసీఆర్ ఒంటరయ్యారా..? బీఆర్ఎస్ తప్పు చేసిందా..?

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే మిత్ర పక్షాలు భేటీ అవుతుంటే.. రెండింట్లోనూ కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. ఎన్డీయేతోపాటు, ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2023 | 03:40 PMLast Updated on: Jul 17, 2023 | 3:40 PM

Brs Is Alone In National Politics Opposition Parties And Nda Alliance Parties Neglecting Brs

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జాతీయ రాజకీయాల్నే మారుస్తానని శపథం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎటూ కాకుండా పోయారనే వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని ఏకంగా బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చడమే కేసీఆర్ చేసిన పొరపాటా..? కేసీఆర్ భవిష్యత్ రాజకీయం ఏంటి..?
తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని పార్టీ అనడంలో సందేహం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా బీఆర్ఎస్ బలమైన పార్టీగానే ఉంటుంది. అయితే, జాతీయ రాజకీయాలతోనే అసలు చిక్కువచ్చిపడింది. టీఆర్ఎస్‌ను కేసీఆర్.. బీఆర్ఎస్‌గా మార్చారు. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. బీఆర్ఎస్‌గా మార్చడమే కేసీఆర్ చేసిన పొరపాటేమో అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే మిత్ర పక్షాలు భేటీ అవుతుంటే.. రెండింట్లోనూ కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. ఎన్డీయేతోపాటు, ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని
బీఆర్ఎస్‌ అనే పార్టీని స్థాపించగానే కేసీఆర్ దూకుడు ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్తూ, అక్కడి రైతులకు తెలంగాణ డబ్బు ఇస్తూ ఏదో హడావిడి చేశారు. పంజాబ్ వెళ్లి అక్కడి ఆమ్ఆద్మీ తరఫున సీఎంగా ఎన్నికైన భగవంత్ మన్‌సింగ్, బిహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్, కర్ణాటక వెళ్లి జేడీఎస్ అధినేత కుమారస్వామి వంటి జాతీయ నేతల్ని కలిశారు. అలాగే యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (జేఎంఎం) వంటి నేతలతోనూ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని వారితో కలిసి నడిపించాలనుకున్నారు. దీనిపై ఆయా నేతలతో కొన్ని చర్చలు కూడా జరిగాయి. మహారాష్ట్ర, ఏపీలోనూ బీఆర్ఎస్‌ను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ఏ ప్రయోజనం కనిపించడం లేదు. ఎక్కడా బీఆర్ఎస్‌కు హైప్ రావడం లేదు.
హ్యాండిచ్చిన మిత్రులు
ఏ రాష్ట్రంలోనైనా బీఆర్ఎస్ సొంతంగా ఎదగడం కష్టం. అందుకే అక్కడున్న పార్టీలతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నించారు. అవసరమైతే ఎన్నికల్లో ఆర్థిక సాయం చేసేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి అండతో కూడా ఎదిగేందుకు ప్రయత్నించారు. కానీ, ఎవరి నుంచీ సరైన స్పందన కనిపించలేదు. మొదట్లో కర్ణాటక నుంచి జేడీఎస్ మద్దతు లభించింది. ఆ పార్టీతో కలిసి కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించారు. ఎన్నికల ప్రచార ఖర్చును బీఆర్ఎస్ భరించాలనుకుంది. తీరా చూస్తే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. కనీసం మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌కు మద్దతు కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్, కుమారస్వామి మధ్య దూరం పెరిగినట్లుగానే భావించాలి. పైగా కుమారస్వామి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి నడుద్దాం అనుకున్నా అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్, ఆమ్ ఆద్మీ కేసీఆర్‌కు మొండి చేయి చూపించినట్లే. అప్పట్లో కేసీఆర్‌తో చర్చలు జరిపిన బిహార్ సీఎం నితీష్ కుమార్ (జేడీయూ), నితీష్ కుమార్ (ఆర్జేడీ), అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్) కూడా కేసీఆర్‌కు దూరంగా కాంగ్రెస్‌ కూటమిలోనే చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల అఖిలేష్ సీఎం కేసీఆర్‌ను కలిసినా.. బీఆర్ఎస్‌తో కలిసే విషయంలో ఎటువంటి హామీ రాలేదు. పశ్చిమ బెంగాల్‌ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి డీఎంకే సహా ఏ పార్టీ కేసీఆర్ వెంట నడిచే అవకాశం లేదు. మొదట అందరూ కేసీఆర్‌తో కలిసేందుకు ఆసక్తి చూపించినప్పటికీ ఇప్పుడు ఎవరూ కేసీఆర్‌ను పట్టించుకోవడం లేదు. మొత్తంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఏ పార్టీ కూడా కేసీఆర్‌తో కలిసేందుకు లేదా కలుపుకొనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.
ఎన్డీయేతో సంగతేంటి..?
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలకు దూరంగా ఉంటున్నారు సరే.. పోనీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనైనా బీఆర్ఎస్ చేరుతుందా అంటే ఆ అవకాశమే లేదు. అలాంటి రాజకీయ పరిస్థితులు కూడా లేవు. ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్‌కు ఒక ఆయుధం దొరికినట్లే. ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. ఆవిడను తప్పించడానికే బీజేపీతో బీఆర్ఎస్ జట్టుకట్టిందనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇది ఆ రెండు పార్టీలకూ ఇబ్బంది. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు బీ టీమ్ అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ కూటమిలోనూ బీఆర్ఎస్ చేరలేకపోతోంది. అయితే, కాంగ్రెస్ లక్ష‌్యంగా మాత్రం బీఆర్ఎస్ ఘాటైన విమర్శలు చేస్తోంది. బీజేపీపై కూడా విమర్శలు చేస్తున్నా.. అవి గతంలోలాగా లేవు.
పట్టించుకోని పార్టీలు.. చక్రం తిప్పేదెలా..?
బీజేపీపై, కాంగ్రెస్‌పై గతంలో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. అధ్యక్షుడు కేసీఆర్ మొదలుకుని చోటా నేతల వరకు రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు రెండు పార్టీల కూటమిలోనూ బీఆర్ఎస్‌కు అవకాశం లేకుండా పోయింది. ఏపీకి సంబంధించి జగన్ (వైసీపీ) అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి ప్రతిపక్షాలు పిలవలేదనుకోవచ్చు. మరి కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు..? బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే కారణంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు పక్కనపెడితే, కాంగ్రెస్‌కు బీ టీంగా ఉంటోందని ఎన్డీయే కూడా బీఆర్ఎస్‌ను పక్కనపెట్టింది. రెండు కూటముల సమావేశం జరుగుతున్నా ఎటువైపు నుంచీ బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందలేదు. జాతీయ రాజకీయాలు ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష కూటమిగా మారిపోతున్నాయి. ఇక మధ్యలో బీఆర్ఎస్‌కు ఛాన్స్ ఎక్కడుంటుంది. జాతీయ రాజకీయాల్లో అసలు ప్రాధాన్యమే లేనప్పుడు కేసీఆర్ చక్రం తిప్పేదేముంటుంది. తనవంతు ప్రయత్నాలు చేస్తున్నా దానికి తగ్గ ఫలితం ఉండాలి కదా. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుంది. ఎందుకంటే ఏదో ఒకవైపు వెళ్తే తప్ప జాతీయ రాజకీయాల్లో గుర్తింపు దక్కడం అసాధ్యం. ఇప్పుడు కేసీఆర్‌ ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తాజా రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే కేసీఆర్ ఒంటరయ్యారనే చెప్పాలి. జాతీయ రాజకీయాలపై కాకుండా ఇకపై తెలంగాణపైనే ఫోకస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్‌కు అధికారం అప్పగించాల్సిందే.