ALLU ARJUN: అల్లు అర్జున్ మామకు కేసీఆర్ షాక్.. నాగార్జున సాగర్ టిక్కెట్ నిరాకరణ..!
బీఆర్ఎస్ నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ టిక్కెట్ ఆశించారు. కొంతకాలంగా నియోజకవర్గంలో పని చేస్తున్న ఆయన టిక్కెట్ కోసం చివరిదాకా ప్రయత్నించారు. తనకు టిక్కెట్ ఇస్తే, అల్లు అర్జున్‌తో ప్రచారం చేయిస్తానని, ఎన్నికల్లో గెలుస్తానని అధిష్టానానికి తెలియజేశారు.
ALLU ARJUN: స్టార్ హీరో అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సీఎం కేసీఆర్ షాకిచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి ఆశించిన నాగార్జున సాగర్ టిక్కెట్‌ను నోముల భగత్‌కు కేటాయించారు. దివంగత నేత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్. కమ్యూనిస్టు అయిన నోముల నర్సింహయ్య బీఆర్ఎస్‌లో చేరి, నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, అనారోగ్యంతో మరణించారు. తర్వాత ఈ స్థానం నుంచి ఆయన తనయుడు నోముల భగత్, బీఆర్ఎస్ నుంచి గెలిచారు.
అయితే, నోముల భగత్‌పై వ్యతిరేకత ఉందని, ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టిక్కెట్ ఆశించారు. కొంతకాలంగా నియోజకవర్గంలో పని చేస్తున్న ఆయన టిక్కెట్ కోసం చివరిదాకా ప్రయత్నించారు. తనకు టిక్కెట్ ఇస్తే, అల్లు అర్జున్‌తో ప్రచారం చేయిస్తానని, ఎన్నికల్లో గెలుస్తానని అధిష్టానానికి తెలియజేశారు. ఇటీవల అల్లు అర్జున్‌తో నియోజకవర్గంలో ఒక కార్యక్రమం నిర్వహించి, భారీ హంగామా కూడా చేశారు. తనకున్న బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. అటు నోముల భగత్‌పై వ్యతిరేకత ఉండటం, ఇటు చంద్రశేఖర్ రెడ్డి బలప్రదర్శన చేయడంతో ఆయనకు టిక్కెట్ దక్కుతుందేమోనని అందరూ ఆశించారు.
కానీ, కేసీఆర్ చంద్రశేఖర్ రెడ్డికి షాకిస్తూ.. నోములకే టిక్కెట్ కేటాయించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డికి నిరాశ తప్పలేదు. గతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కేసీఆర్ నిర్ణయంతో అది సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి వేరే పార్టీలో చేరుతారా..? లేక బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా..? అన్నది వేచి చూడాలి.