చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ను బాబు దెబ్బ కొడతారా…?
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని టీడీపీ దెబ్బ కొడుతుందా...? తమ నాయకులను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్దం చేసారా...? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బిజెపిలోకి వెళ్ళలేక సతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి, బాబు సైకిల్ ఎక్కిస్తారా...?
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని టీడీపీ దెబ్బ కొడుతుందా…? తమ నాయకులను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్దం చేసారా…? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బిజెపిలోకి వెళ్ళలేక సతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి, బాబు సైకిల్ ఎక్కిస్తారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2018 తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావించిన తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది.
కీలక నాయకత్వం మొత్తం బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం, మాస్ నాయకులుగా పేరున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లి కీలక పాత్ర పోషించడం… టీడీపీకి ఊపిరి ఆడనివ్వలేదు. తెలంగాణాలో బలమైన క్యాడర్ ఇప్పటికీ టీడీపీ సొంతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ నేతలే. మల్లారెడ్డి, మాధవరం కృష్ణా రావు, ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, మాగంటి గోపీనాథ్ వంటి వారి 2014 తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి… కారు ఎక్కారు. ఇక ఓటుకి నోటు వ్యవహారం తర్వాత తెలంగాణాలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది.
కనీసం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడలేని నాయకత్వం ఉంది ప్రస్తుతం. ఈ నేపధ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కొన్నాళ్ళుగా తెలంగాణా మీద గురి పెడుతూ వస్తున్నారు. అగ్ర నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకునేందుకు ఆయన ప్లాన్ సిద్దం చేసారనే కథనాలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం కనపడేలా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తన వైపుకి తిప్పుకునేలా సైకిల్ రాజకీయం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కొందరు బయటకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూడా. ఇక మరికొందరు ఏ పార్టీలో చేరాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లకు ఎన్టీఆర్ భవన్ లో ఆశ్రయం ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇటీవల తెలంగాణాలో కమిటీలు అన్నీ రద్దు చేసింది పార్టీ. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణా లో కీలక నేతలకు గురిపెట్టి లాగుతున్నారు. అందులో ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం విశేషం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు చంద్రబాబుని కలిసారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఆహ్వానం ఇవ్వడానికి వెళ్లారు అని చెప్పినా… మాధవరం, తీగల కృష్ణా రెడ్డి ఎందుకు వెళ్ళారు అన్నదే ప్రధాన ప్రశ్న. ఆ ప్రశ్నకు అక్కడే సమాధానం చెప్పారు తీగల. తాను టీడీపీలో జాయిన్ అవుతున్నా అని… త్వరలోనే మరికొంత మంది జాయిన్ అవుతారని స్పష్టత ఇచ్చేసారు. ఇక కలవడానికి మిగిలిన వాళ్ళు చెప్పిన కారణం ఏదైనా గాని… వాళ్ళు మాత్రం టీడీపీలో చేరేందుకు సిద్దపడ్డారు అనేది వాస్తవం అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుని కలవగా మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళారు.
కొన్నాళ్ళుగా మల్లారెడ్డి, మాధవరం పార్టీ మారడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మాధవరం రెండు పర్యాయాలు చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు.ఇప్పుడు మరోసారి చంద్రబాబుని కలవడంతో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణాలో బిజెపికి టీడీపీ అవసరం ఉంది. చాలా జిల్లాల్లో బిజెపికి క్యాడర్ తక్కువ. కాబట్టి టీడీపీ క్యాడర్ తో ముందుకు వెళ్లి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలబడితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చు అనే నమ్మకంలో బిజెపి ఉంది. ఇక జనసేన పార్టీ కూడా తెలంగాణాలో వ్యూహాలు సిద్దం చేసుకుంటుంది. వీళ్ళ అందరి అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ లేకుండా చేయడమే అనేది క్లియర్ గా అర్ధమవుతోంది అంటున్నారు పలువురు.