CM KCR: ఆ 28 మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్.. నెలాఖరులోపు తేలనున్న భవిష్యత్.. బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా..?

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కొందరు ఇతర పార్టీల్లో గెలిచినప్పటికీ, బీఆర్ఎస్‌లో చేరిపోయారు. వీరిలో 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. వీరిపై పోటీ చేసి ఓడిపోయిన సమీప అభ్యర్థులు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 1, 2023 | 05:11 PMLast Updated on: Aug 01, 2023 | 5:11 PM

Brs Mlas In Tension Because Of Disqualification Cases

CM KCR: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరగబోతున్నాయి. 28 మంది ఎమ్మెల్యేల భవిష‌్యత్ మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కదా.. సమస్యేంటి అనుకుంటున్నారా..? ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని కోర్టులో వేసిన పిటిషన్లే ఇప్పుడు సమస్యగా మారాయి. 28 మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. వీటిపై ఈ నెలలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆ 28 మంది ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. వీళ్లంతా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లే. ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిస్తే.. బీఆర్ఎస్‌కు ఇబ్బంది తప్పదు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కొందరు ఇతర పార్టీల్లో గెలిచినప్పటికీ, బీఆర్ఎస్‌లో చేరిపోయారు. వీరిలో 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. వీరిపై పోటీ చేసి ఓడిపోయిన సమీప అభ్యర్థులు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. తప్పుడు ధృవపత్రాలు సమర్పించడం, అఫిడవిట్లు, వోటింగ్, స్థానికత వంటి ఇతర అంశాల ఆధారంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థులు పిటిషన్లు వేశారు. వీటిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే, మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ గడువు ముగుస్తుంది. ఎన్నికలు కూడా జరుగుతాయి. అందుకే ఈ లోగానే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ప్రత్యేకంగా వీటిపై విచారణ జరగనుంది. వీటి ఆధారంగా మరికొద్ది రోజుల్లో తీర్పులు వెలువడుతాయి.

ఈ నెలాఖరులోపే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పులో ఎంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పువస్తుందో అని సిట్టింగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నిక చెల్లదని తీర్పు వస్తే రాజకీయంగా ఇబ్బంది తప్పదు. నిజానికి ఈ అంశంపై 30 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో కొప్పుల ఈశ్వర్ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా నిర్ణయం వెల్లడించింది. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదని కూడా హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తీర్పులు అనుకూలంగా లేకపోవడంతో మిగతా వారిలోనూ భయం మొదలైంది. కొప్పులతోపాటు అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న 28 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
బీఆర్ఎస్ ఏం చేస్తుంది..?
ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని తీర్పునిస్తే బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదు. 28 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావడమంటే సంచలనమే. వీరిలో కొందరికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఇబ్బందే. వీరి విషయంలో బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. వనమాకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినప్పటికీ.. ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. 28 ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తుందా.. రాదా అనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఈ నెల 18న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకే కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో అనర్హత పిటిషన్ల కేసు బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టింది.