MLC KAVITHA: ఈడీ నోటీసు కాదు.. అది మోడీ నోటీసు: ఎమ్మెల్సీ కవిత
అది ఈడీ నోటీసు కాదు. నాకు వచ్చింది మోడీ నోటీసు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నోటీసును మా లీగల్ టీంకు ఇచ్చాం. వారి సలహా ప్రకారం ముందుకెళ్తాం. లిక్కర్ కేసు విచారణ ఏడాది కాలంగా సాగుతూనే ఉంది.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కవిత స్పందించారు. తనకు వచ్చింది ఈడీ నోటీసు కాదని, మోడీ నోటీసు అని పేర్కొన్నారు. “అది ఈడీ నోటీసు కాదు. నాకు వచ్చింది మోడీ నోటీసు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నోటీసును మా లీగల్ టీంకు ఇచ్చాం. వారి సలహా ప్రకారం ముందుకెళ్తాం.
లిక్కర్ కేసు విచారణ ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. టీవీ సీరియల్‌లాగా దీన్ని సాగదీస్తున్నారు. ఎన్నికలొస్తున్నాయి. మళ్లీ ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దు. ఈడీ విచారణ ఇంకెంతకాలం సాగుతుందో తెలియదు. గతంలో 2జీ విచారణ కూడా చాలా కాలంగా సాగింది. తెలంగాణ ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకోరు. మేం ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఏ టీం మేము” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఈడీ నోటీసుల్ని కవిత తేలిగ్గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. తాజా వ్యాఖ్యలు చూస్తుంటే శుక్రవారం కవిత విచారణకు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. పైగా కవిత విచారణపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.
ఈ విషయంలో సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతనే కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, కవిత విచారణకు హాజరుకాకుంటే ఈడీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ సభ్యులు అప్రూవర్లుగా మారారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే తాజాగా కవితకు ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.